Bollywood: ఆమిర్ ఖాన్​ కు మద్దతునిచ్చిన నేపథ్యంలో.. హృతిక్ రోషన్ కు తగిలిన బాయ్ కాట్ సెగ

Boycott Vikram Vedha trends after Hrithik Roshan hails Laal Singh Chaddha

  • ‘లాల్ సింగ్ చడ్డా’ను అందరూ చూడాలన్న హృతిక్
  • హృతిక్ సినిమా ‘విక్రమ్ వేదా’ను బహిష్కరించాలంటున్న నెటిజన్లు
  • ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ‘బాయ్ కాట్ విక్రమ్ వేద’ హ్యాష్ బ్యాగ్

బాలీవుడ్ లో ఈ మధ్య బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో దేశంలో అశాంతి ఉందంటూ ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు గాను అతని తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ను బహిష్కరించాలన్న ప్రచారం జరుగుతోంది. ఇది సినిమాపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

దాంతో, తన చిత్రాన్ని చూడాలంటూ ఆమిర్ విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమిర్ కు మద్దతుగా నిలిచారు. ప్రముఖ యాక్షన్ హీరో హృతిక్‌ రోషన్‌ ఇటీవల ట్విట్టర్ వేదికగా ఆమిర్ కు సపోర్ట్ చేశాడు. ‘ఇప్పుడే లాల్ సింగ్ చడ్డాను చూశా. ఈ సినిమా హృదయాన్ని నేను ఆస్వాదించా. ప్లస్‌లు, మైనస్‌లను పక్కన పెడితే, ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని అస్సలు మిస్ చేయకండి, ఇప్పుడే వెళ్లి చూడండి’ అని ట్వీట్ చేశాడు. 

ఇది నెటిజన్లకు, ఆమిర్ ను వ్యతిరేకిస్తున్న వారికి రుచించలేదు. దాంతో, హృతిక్ తదుపరి చిత్రం ‘విక్రమ్ వేద’ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ విక్రమ్ వేద’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు. కొంతమంది ఆమిర్ కు మద్దతు ఇవ్వడాన్ని తప్పుబట్టగా.. మరికొందరు ‘ ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని హృతిక్ ను ప్రశ్నిస్తున్నారు. ఆ చిత్రం అంత భారీ విజయం తర్వాత హృతిక్ ఎందుకు ట్వీట్ చేయలేదు? దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు? అంటూ నిలదీస్తున్నారు. కాగా, హృతిక్ ‘విక్రమ్ వేద’ హిందీ వెర్షన్ సెప్టెంబర్ లో విడుదల కానుంది.

More Telugu News