Hyderabad: హైదరాబాద్ నుంచి వెళ్తూ కరాచీలో ల్యాండైన విమానం.. నెల రోజుల్లో మూడోసారి!

Charter plane carrying 12 passengers from Hyderabad lands at Karachi airport

  • మధ్యాహ్నం 12.10 గంటలకు కరాచీలో ల్యాండైన విమానం
  • గత నెలలో స్పైస్‌జెట్, ఇండిగో విమానాల అత్యవసర ల్యాండింగ్
  • ఆ విమానంతో భారత్‌కు ఎలాంటి సంబంధమూ లేదన్న సివిల్ ఏవియేషన్

హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 12 మంది ప్రయాణికులతో బయలుదేరిన చార్టర్డ్‌ విమానం పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండైంది. విమానం ల్యాండ్ కావడానికి గల కారణాలు తెలియరాలేదు. మధ్యాహ్నం 12.10 గంటలకు కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైన విమానం ఆ తర్వాత కాసేపటికే తిరిగి అక్కడి నుంచి బయలుదేరింది. కాగా, ఇటీవల కూడా భారత్‌కు చెందిన రెండు విమానాలు పాకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండయ్యాయి. తాజా ఘటన నెల రోజుల్లో మూడోది.

జులై 5న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం అత్యవసరంగా కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ కాగా, అదే నెల 17న షార్జా-హైదరాబాద్ విమానం ఇంజిన్‌లో లోపాన్ని గుర్తించిన పైలట్ కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. కాగా, చార్టర్డ్‌ విమానం కరాచీలో దిగిన విషయాన్ని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) నిర్ధారించింది. అంతర్జాతీయ చార్టర్డ్‌ విమానం ఇండియా నుంచి టేకాఫ్ అయిందని, అయితే ఆ విమానంతో అంతకుమించి సంబంధం లేదని పేర్కొంది.

More Telugu News