Stalin: ఉభయ రాష్ట్రాల సరిహద్దులో ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై సీఎం జగన్ కు లేఖ రాసిన స్టాలిన్

Tamilandu CM Stalin wrote AP CM Jagan on two new projects
  • చిత్తూరు జిల్లాలో కొత్త డ్యామ్ లు
  • కోశస్థలి నదిపై రెండు చోట్ల ప్రాజెక్టులు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన తమిళనాడు ప్రభుత్వం
  • జగన్ జోక్యం చేసుకోవాలన్న సీఎం స్టాలిన్
చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఏపీ రెండు ప్రాజెక్టులు నిర్మిస్తోంది. కతరపల్లి, ముక్కలకండ్రిగ గ్రామాల వద్ద కోశస్థలి నదిపై రెండు చోట్ల డ్యామ్ లు నిర్మించేందుకు ఏపీ సర్కారు అనుమతులు ఇచ్చింది. అయితే, ఈ రెండు ప్రాజెక్టులపై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. ఈ రెండు డ్యామ్ ల కారణంగా భవిష్యత్తులో చెన్నై నగరానికి పూర్తిస్థాయిలో తాగునీటి సమస్య ఏర్పడే ముప్పు ఉందంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. 

కోశస్థలి నదీ పరీవాహక ప్రాంతం రెండు రాష్ట్రాల్లో ఉందని, ఏపీలో అది 877 కిలోమీటర్లు కాగా, తమిళనాడులో 2,850 కిలోమీటర్లు అని వివరించారు. ఈ నదిపైనే తాము పూండి వద్ద రిజర్వాయర్ నిర్మించామని, ఇప్పుడు ఎగువన ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడితే పూండి రిజర్వాయర్ కు నీటి లభ్యత తగ్గిపోతుందని సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై నగరానికి తీవ్ర నీటి కొరత ఏర్పడడమే కాకుండా, పరిసర గ్రామాలపైనా ఆ ప్రభావం ఉంటుందని తన లేఖలో పేర్కొన్నారు. 

తమిళనాడు ప్రభుత్వంతో చర్చించనిదే ఆ రెండు ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్లరాదని హితవు పలికారు. ఇది సున్నితమైన అంశం అని, సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్లకుండా అధికారులకు దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నామని స్టాలిన్ తెలిపారు.
Stalin
Jagan
Projects
Kosasrhali River
Chittoor District
Tamilnadu
Andhra Pradesh

More Telugu News