Euthansia: 'కారుణ్య మరణం' కోసం నా స్నేహితుడు స్విట్జర్లాండ్ వెళుతున్నాడు... అతడ్ని ఆపండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఓ మహిళ

Woman approaches Delhi High Court to stop her friend who set to go Switzerland for Euthanasia

  • అరుదైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి
  • జీవితంపై విరక్తితో స్విట్జర్లాండ్ వెళుతున్న వైనం
  • అతడి చికిత్సకు అవకాశాలు ఉన్నాయన్న మహిళ
  • ఇమ్మిగ్రేషన్ అనుమతులు ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి

దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితుడు కారుణ్య మరణం (యూథనేషియా) కోసం స్విట్జర్లాండ్ వెళుతున్నాడని, అతడిని ఆపాలని కోరుతూ ఓ మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అతడు మయలాజిక్ ఎన్ సెఫలోమైలిటిస్ (దీర్ఘకాలిక నీరసం) రుగ్మతతో బాధపడుతున్నాడని, ఇది శరీరాన్ని కుంగదీసే సంక్లిష్టమైన నరాల వాపు జబ్బు అని ఆ మహిళ తన పిటిషన్ లో వివరించింది. 

2014లో అతడు ఈ వ్యాధి బారినపడ్డాడని, ఇప్పుడు దాదాపుగా మంచానికే పరిమితం అయ్యాడని, ఇంట్లో కొన్ని అడుగులు వేయగలడని, అంతకుమించి నడవలేడని ఆమె వివరించింది. కరోనా సంక్షోభానికి ముందు ఎయిమ్స్ లో చికిత్స పొందాడని, కరోనా సంక్షోభం వేళ దాతలు లభించక చికిత్సను కొనసాగించలేకపోయాడని వివరించింది. అయితే ఇప్పుడతడికి దేశంలోనూ, విదేశాల్లోనూ చికిత్స పొందేందుకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, అయినా అతడు జీవితాన్ని ముగించేందుకు స్విట్జర్లాండ్ వెళుతున్నాడని ఆమె వివరించింది. 

అతడిని స్విట్జర్లాండ్ వెళ్లేందుకు అనుమతిస్తే, ఇక్కడ వృద్ధులైన అతడి తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా మారుతుందని పేర్కొంది. అతడికి కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ అనుమతులు ఇవ్వరాదని ఆ 49 ఏళ్ల మహిళ అభ్యర్థించింది.

కాగా, స్విట్జర్లాండ్ లో యూథనేషియా చట్టబద్ధమే! నయం కాని జబ్బులతో బాధపడేవారు ఓ వైద్యుడి పర్యవేక్షణలో సునాయాసంగా ప్రాణాలు విడిచే ప్రక్రియను యూథనేషియా అంటారు. యూథనేషియా కోసం ఓ సంస్థ సాక్రో అనే యంత్రానికి రూపకల్పన చేసింది. ఈ యంత్రం ఓ శవపేటికను పోలి ఉంటుంది. ఇందులో కూర్చుంటే రెప్పపాటు కాలంలో వ్యక్తిలో ఆక్సిజన్ స్థాయులు పడిపోయి ప్రాణాలు పోతాయి. కారుణ్య మరణం కోసం ఇంకా మరికొన్ని విధానాలు కూడా అమల్లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News