: వాటివల్లే ప్రొస్టేట్ క్యాన్సర్ మళ్లీ వస్తోంది
పురుషుల్లో వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స చేసినా కొందరిలో మళ్లీ వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇలా ప్రొస్టేట్ క్యాన్సర్ మళ్లీ రావడానికి కారణాలను ఆష్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీరు తమ పరిశోధనల్లో ఈ క్యాన్సర్ మళ్లీ రావడానికి దోహదం చేసే కణాల ఉప సముదాయాలను గుర్తించారు.
ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు పురుష హార్మోన్లను తగ్గించే చికిత్సను ఇస్తుంటారు. అయితే ఈ చికిత్సను తట్టుకుని కూడా ఈ క్యాన్సర్‌కు చెందిన కొన్ని కణాలు శరీరంలోనే మనుగడ సాగిస్తూ ఉంటాయని, అవే తిరిగి ఈ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ కణాలు క్యాన్సర్ ప్రారంభ దశనుండే ఉంటాయి. కాబట్టి వ్యాధి తీవ్రతరం కాకముందే సమర్ధవంతమైన లక్షిత చికిత్సల ద్వారా వీటిని సమర్ధవంతంగా అడ్డుకునే అవకాశముందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు, ఈ ఉపకణాల గుర్తింపు పరిజ్ఞానం ఈ వ్యాధిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన లక్షిత చికిత్సల రూపకల్పనకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.