smoking: 'నేను సిగరెట్ కాల్చింది డమ్మీ విమానంలో..' అంటున్న బాబీ కటారియా
- దుబాయ్ లో షూటింగ్ లో భాగంగా చేసిన వీడియో అని వివరణ
- జనవరిలో తమ విమానంలో సిగరెట్ కాల్చాడని చెప్పిన స్పైస్ జెట్
- అప్పుడే తమ దృష్టికి వచ్చిందని చెప్పిన సంస్థ
స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగి పోలీసు కేసును ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ బాబీ కటారియా ఈ ఘటనపై వివరణ ఇచ్చాడు. తాను సిగరెట్ తాగింది నిజమైన విమానంలో కాదని.. అది డమ్మీ విమానంలో అని అన్నాడు. దుబాయ్ లో ఓ షూటింగ్ లో భాగంగా చేసిందన్నాడు.
అయితే, జరిగిన ఘటనపై స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ ఇచ్చిన వివరణకు బాబీ కటారియా వాదన పూర్తి విరుద్దంగా ఉంది. ఈ ఘటన జనవరిలో తమ విమానంలో జరిగిందని స్పైస్ జెట్ ధ్రువీకరించింది. ఈ విషయాన్ని క్షుణ్ణంగా విచారించామని, గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
‘ఈ వీడియో జనవరి 20, 2022 న దుబాయ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎస్జీ 706 విమానంలో ప్రయాణికులు ఎక్కుతుండగా చిత్రీకరించారు. క్యాబిన్ సిబ్బంది ఆన్-బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయడంలో నిమగ్నమై ఉన్నప్పుడు 21వ వరుసలో ఉన్న సదరు ప్రయాణికుడు, అతని సహ-ప్రయాణికులు ఈ వీడియోను చిత్రీకరించారు. దీని గురించి ఇతర ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా ద్వారా జనవరి 24న ఈ విషయం మా దృష్టికి వచ్చింది’ అని స్పైస్ జెట్ పేర్కొంది.
ఫిబ్రవరిలోనే అతడిని 15 రోజుల పాటు నో -ఫ్లైయింగ్ లిస్ట్‌లో ఉంచినట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. అటువంటి ప్రమాదకర ప్రవర్తనను సహించేది లేదని మంత్రి చెప్పారు.