Uttar Pradesh: రోజుకు 12 గంటలు డ్యూటీ చేస్తే ఇలాంటి తిండా పెట్టేది.. ఏడ్చేసిన యూపీ కానిస్టేబుల్: వీడియో వైరల్
- కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలకు సిద్ధమైన ఉన్నతాధికారులు
- ఆయనపై 15 కేసులు ఉన్నాయన్న ఎస్పీ
- దర్యాప్తునకు ఆదేశం
రోజుకు 12 గంటలు కష్టపడి డ్యూటీ చేస్తున్న తమకు ఇలాంటి భోజనం పెడతారా? అని కన్నీళ్లు పెట్టుకున్న కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరిగిందీ ఘటన. కోర్టు వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ మనోజ్ కుమార్ బుధవారం భోజనం ప్లేటుతో రోడ్డుపైకి వచ్చి తన బాధను పంచుకున్నాడు. రోజుకు 12 గంటలు కష్టపడి డ్యూటీ చేస్తున్న తమకు ఇలాంటి భోజనం పెడతారా? అంటూ తమకు అందించిన రొట్టెలు, ఇతర పదార్థాలను చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఫిరోజాబాద్‌లోని మెస్‌లో అందించే భోజనం ఏమాత్రం బాగుండడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కానిస్టేబుళ్లకు పోషకాహారం కోసం రూ. 1,875 ఇస్తామన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఏమైందని ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. క్రమశిక్షణ రాహిత్యం, విధులకు గైర్హాజరు సహా మనోజ్‌పై మొత్తం 15 కేసులు పెండింగులో ఉన్నాయన్న సీనియర్ ఎస్పీ ఆశిష్ తివారీ దర్యాప్తునకు ఆదేశించారు.