Tirumala: తిరుమల క్షేత్రంలో మరోసారి భక్తుల తాకిడి
- ఇటీవల కాస్త తగ్గిన భక్తుల రద్దీ
- ప్రస్తుతం సెలవులు, శ్రావణమాసంలో మళ్లీ పెరిగిన రద్దీ
- సర్వదర్శనానికి 15 గంటల సమయం
- నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.5.15 కోట్ల ఆదాయం
మొన్నటివరకు తిరుమలకు భక్తుల తాకిడి కాస్త తగ్గింది. అయితే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడం, సెలవులు రావడంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య బాగా పెరిగింది. నిన్న తిరుమల శ్రీవారిని 74 వేల మంది దర్శించుకున్నారు. స్వామివారి సర్వదర్శనం కోసం 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా, దర్శనం కోసం 15 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే వెంకన్నకు హుండీ ద్వారా రూ.5.15 కోట్ల ఆదాయం రావడం విశేషం.
కాగా, తమిళులకు పవిత్రమైనది పెరటాసి మాసం. దాంతో తమిళనాడు నుంచి మరింత మంది భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ నెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు కూడా జరగనున్నాయి. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి. ఈసారి భక్తుల నడుమ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.