Narendra Modi: ఆ కమిటీలో పోప్, ఐరాస చీఫ్ లతో పాటు భారత ప్రధాని మోదీ కూడా ఉండాలి: మెక్సికో అధ్యక్షుడు
- ప్రపంచశాంతికి ప్రయత్నం
- ఆసక్తికర ప్రతిపాదన చేసిన మెక్సికో అధ్యక్షుడు
- ఉన్నతస్థాయి కమిషన్ కోసం ప్రతిపాదన
- ఐరాసకు లేఖ రాస్తానని వెల్లడి
మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రడోర్ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న యుద్ధాలను నిలువరించేందుకు ఓ ఉన్నతస్థాయి కమిషన్ ఏర్పాటు చేయాలని, అందులో పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రాస్ తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా స్థానం కల్పించాలని అన్నారు.
ఐదేళ్ల పాటు ఎలాంటి యుద్ధాలు జరగకుండా ఈ కమిషన్ ఓ సంధి ఒడంబడికకు రూపకల్పన చేయాల్సి ఉంటుందని ఓబ్రడోర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తాను ఐక్యరాజ్యసమితికి లేఖ రాస్తానని వెల్లడించారు.
తమకు అనువుగా అనిపించకపోతే మీడియా ఇలాంటి వాటికి దూరంగా ఉంటుందని, అలా కాకుండా తాను ప్రతిపాదించిన అంశానికి మీడియా కూడా విస్తృతంగా ప్రచారం కల్పిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపాదిత కమిషన్ తీసుకువచ్చే ఒడంబడికను అన్ని దేశాలు గౌరవిస్తే, కనీసం ఐదేళ్లపాటైనా ప్రజలు యుద్ధాలకు దూరంగా ప్రశాంతంగా జీవిస్తారని ఓబ్రడోర్ అభిప్రాయపడ్డారు.