Pladda Island: సొంతంగా ఓ దీవి కొనుక్కుంటారా.. రూ.3.5 కోట్లకే అమ్మకం!
- 28 ఎకరాల విస్తీర్ణం.. ఓ పెద్ద ఇల్లు, హెలిప్యాడ్, మరో రెండు చిన్న నివాసాలు కూడా..
- రకరకాల సముద్ర జీవులు, పక్షులకు నిలయమైన ప్లాడ్డా దీవి
- నౌకలకు దారి చూపే లైట్ హౌజ్.. చుట్టూ మరికొన్ని దీవులు
ఎక్కడైనా మనకంటూ సొంత స్థలం ఉండటం గొప్పే.. అదీ సముద్రం మధ్యలో మన కంటూ ప్రత్యేకంగా ఓ దీవి ఉంటే..? చాలా మందికి ఇలాంటి కలలు ఉంటాయి. అలాంటి కలలు తీర్చుకునేందుకు, మరీ పెద్దగా ఖర్చు పెట్టకుండానే ఓ దీవిని సొంతం చేసుకునేందుకు ఓ అవకాశం వచ్చింది. యునైటెడ్ కింగ్ డమ్ పరిధిలోని స్కాట్లాండ్ సముద్ర తీరానికి కాస్త దూరంలో ఉన్న ప్లాడ్డా దీవి అమ్మకానికి వచ్చింది. ధర కూడా సుమారు రూ.3.5 కోట్లు (3.5 లక్షల పౌండ్లు) మాత్రమే. దాని ప్రస్తుత యజమానులు 1990లో ఈ దీవులను కొనుక్కున్నారని.. వారి వారసులు ప్రస్తుతం అమ్మకానికి పెట్టారని యూకేకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది.
నీటి బొట్టు ఆకృతిలో..
- స్కాట్లాండ్ సముద్ర తీరంలో అర్రన్ ద్వీపానికి కిలోమీటర్ దూరంలో సముద్రంలో ప్లాడ్డా దీవి ఉంది. నీటి బిందువు ఆకృతిలో ఉన్న ఈ ద్వీపం విస్తీర్ణం 28 ఎకరాలు. ఇందులో ఒక లైట్ హౌజ్ తో కూడిన పెద్ద ఇల్లు, మరో చిన్న ఇల్లు, ఒక బోట్ హౌజ్ ఉన్నాయి.
- ఒక హెలిప్యాడ్, ట్రాక్టర్ షెడ్ కూడా ఉన్నట్టు అమ్మకపు సంస్థ తెలిపింది.
- పెద్ద ఇంటి పక్కన రెండున్నర ఎకరాల్లో తోటలు ఉన్నాయని.. గతంలో అక్కడ పండ్లు, కూరగాయలు పండించారని వివరించింది.
- పెద్ద ఇంట్లో ఐదు బెడ్రూంలు, రెండు హాళ్లు, ఒక కిచెన్ కం డైనింగ్ రూమ్ ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా దీవిలోని ఇళ్లను వినియోగించడం లేదని.. వాటిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
- ఏమైనా సరుకులు కావాలంటే.. దగ్గర్లోని సిల్వర్ శాండ్స్ బీచ్, దాని పక్కన ఉన్న కిల్డోనాన్ గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. వాటిని చేరుకునేందుకు 15 నిమిషాల పాటు బోటులో ప్రయాణించాల్సి ఉంటుందని వివరించింది.
- డాల్ఫిన్లు, సీల్స్ వంటి చాలా రకాల సముద్ర జీవులు, పక్షులకు ప్లాడ్డా దీవి నిలయమని.. సమీపంలో మరికొన్ని పెద్ద దీవులూ ఉన్నాయని వివరించింది.