WhatsApp: ఇకపై వాట్సాప్ లో రెండు రోజుల తర్వాత కూడా మెస్సేజ్ డిలీట్ చేసుకోవచ్చు!
- ప్రస్తుతం పంపిన తర్వాత గంట వరకే ఈ అవకాశం
- ఇకపై రెండు రోజుల వరకు అవతలి వారి ఫోన్ నుంచి తొలగించొచ్చు
- గ్రూపులోని సభ్యులు అందరి ఫోన్లలో మెస్సేజ్ డిలీట్
- అడ్మిన్లకు కొత్త అధికారాలు
ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ తన యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందించేందుకు ప్రయత్నం చేస్తుంటుంది. వాట్సాప్ లో ఒకరికి మెస్సేజ్ పంపిన తర్వాత, సాధారణంగా గంట వరకు దాన్ని అవతలి వారి ఫోన్ లో లేకుండా డిలీట్ చేసే ఆప్షన్ పంపిన వారికి ప్రస్తుతం ఉంది. ఇకపై రెండు రోజుల వరకు పంపిన మెస్సేజ్ ను అవతలి వారి ఫోన్ నుంచి తొలగించుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తోంది.
కొన్ని రకాల సందేశాలు అవతలి వారి ఫోన్ లో ఉండకూడదని భావిస్తే తొలగించేందుకు ఇది అనుకూలంగా ఉండనుంది. ఇక వాట్సాప్ లో గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని అధికారాలు లభించనున్నాయి. గ్రూపులోని ప్రతి ఒక్కరి ఫోన్ లో మెస్సేజ్ లు డిలీట్ అయ్యే ఆప్షన్ అడ్మిన్లకు ఉంటుంది. తప్పుడు సమాచారం వ్యాప్తి ఎక్కువ అవుతున్న తరుణంలో గ్రూపు అడ్మిన్లకు మరిన్ని అధికారాలు కల్పించడం ద్వారా, దీన్ని నిరోధించొచ్చని వాట్సాప్ యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.