Uttar Pradesh: వాటర్ బాటిల్ కోసం వివాదం.. కదులుతున్న రైలు నుంచి ప్రయాణికుడిని తోసేసిన ప్యాంట్రీ సిబ్బంది

 Man Beaten and Thrown Out Of Moving Train in uttar pradesh

  • సోదరితో కలిసి రైలులో ప్రయాణిస్తున్న రవి యాదవ్
  • వాటర్ బాటిల్, గుట్కా విషయంలో ప్యాంట్రీ సిబ్బందితో గొడవ
  • సోదరి రైలు దిగినా రవిని రైలు దిగకుండా అడ్డుకున్న సిబ్బంది
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితుడు 

రైలులో వాటర్ బాటిల్ కోసం చెలరేగిన వివాదంలో ప్రయాణికుడిపై దాడిచేసిన ప్యాంట్రీ సిబ్బంది కదులుతున్న రైలు నుంచి అతడిని కిందికి తోసేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. రవి యాదవ్ (26) తన సోదరితో కలిసి రప్తి సాగర్ రైలులో ప్రయాణిస్తున్నాడు. వాటర్ బాటిల్, గుట్కా కొనుగోలు విషయంలో రవికి, ప్యాంట్రీ సిబ్బందికి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. 

ఈ క్రమంలో రవి దిగాల్సిన లలిత్‌పూర్ స్టేషన్ రాగా ఆయన సోదరి దిగింది. గొడవ నేపథ్యంలో రవిని దిగకుండా అడ్డుకున్న ప్యాంట్రీ సిబ్బంది రైలు కదిలిన తర్వాత అతడిపై దాడిచేశారు. ఆపై రైలు నుంచి కిందికి తోసేశారు. కిందపడి తీవ్ర గాయాలపాలైన రవిని కొందరు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రవి యాదవ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News