Printing: ఒకే పేపర్​ పై మళ్లీ మళ్లీ ప్రింట్​ చేసుకోవచ్చు.. సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి..!

Printing on the same paper again and again

  • కాగితాలపై ఇంకును తొలగించే డీప్రింటర్ ను రూపొందించిన రీపర్ సంస్థ
  • ప్రత్యేకమైన కాగితాలను వినియోగిస్తే.. పది సార్ల దాకా మళ్లీ మళ్లీ వినియోగం
  • పేపర్ వినియోగం తగ్గి.. పర్యావరణానికి ఎంతో ప్రయోజనం అంటున్న సంస్థ

వివిధ అవసరాల కోసం స్కూళ్లు మొదలు ఆఫీసుల దాకా రోజూ వందలు, వేల కొద్దీ కాగితాలపై ప్రింటింగ్ చేస్తుంటారు. అవసరం తీరగానే అవన్నీ చెత్త బుట్టలోకే చేరుతాయి. అసలే కాగితం తయారీ కోసం రోజూ పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేస్తున్న పరిస్థితి. చెట్లు తగ్గిపోవడంతో గ్లోబల్ వార్మింగ్ సమస్య తలెత్తుతోంది. 

ఈ నేపథ్యంలో అటు చెట్లు నరికివేయడాన్ని తగ్గించడం, ఇటు కాగితం ముద్రణకు సంబంధించి శ్రమను తగ్గించడం కోసం రీప్ సంస్థ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. కాగితాలపై ఇంకును తుడిచేస్తూ.. మళ్లీ మళ్లీ వాడుకోగలిగే ‘డీప్రింటర్’ సాంకేతికతను రూపొందించింది. ఈ డీ ప్రింటర్‌ కాగితాలపై ఇంకును తొలగించి, మళ్లీ తెల్ల కాగితాలుగా మార్చేస్తుంది. దీనిని ‘రీప్‌ సర్క్యులర్‌ ప్రింట్‌ (ఆర్‌ సీపీ)’ అని పిలుస్తున్నారు.

ప్రత్యేకమైన పేపర్ మీద.. ప్రింటింగ్.. క్లీనింగ్
  • ఆర్ సీపీ టెక్నాలజీలో భాగంగా ప్రత్యేకమైన పేపర్‌ ను రూపొందించారు. ఆ పేపర్‌ పై ప్రింటింగ్ చేసినప్పుడు ఇంకు పూర్తిగా లోపలి వరకు ఇంకిపోకుండా పైపొరల్లోనే ప్రింట్ అవుతుంది.
  • తర్వాత ఈ పేపర్లను ‘డీ ప్రింటర్‌’లో పెడితే అందులోని అత్యంత శక్తివంతమైన లేజర్లు పేపర్ ను వేడి చేసి.. ఇంకు ఆవిరి అయిపోయేలా చేస్తుంది. మళ్లీ తెల్ల కాగితాలు బయటికి వస్తాయి.
  • ఈ సాంకేతికతతో ఒక్కో పేపర్‌ ను పది సార్లు వాడుకోవచ్చని రీప్‌ కంపెనీ నిపుణులు చెబుతున్నారు. చెట్లను నరకడం 90 శాతం తగ్గిపోతుందని.. కాగితాల అవసరం ఎక్కువగా ఉండే చోట ఇది అద్భుతంగా పనికొస్తుందని పేర్కొంటున్నారు.
  • పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు ఖర్చూ తగ్గుతుందని రీప్ సంస్థ నిపుణులు చెబుతున్నారు.
  • పైగా తరచూ కాగితాలు తెచ్చుకోవడం, ముక్కలు చేసి పడేయడం, రీసైక్లింగ్ కోసం పంపడం వంటి ఎన్నో పనులు తగ్గిపోతాయని స్పష్టం చేస్తున్నారు. 

More Telugu News