Venkaiah Naidu: ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి చెరగని ముద్ర.. వాట్ నెక్ట్స్?
- ఈ నెల 10తో ముగియనున్న పదవీకాలం
- తదుపరి వెంకయ్య ప్రస్థానంపై సందిగ్ధత
- రాజ్యసభ చైర్మన్ గా ఎన్నో మార్పులు
- సభ్యుల హాజరు శాతం పెంపు
- సభలో ఆరోగ్యకర వాతావరణానికి కృషి
ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో కంటే.. పరోక్షంగా దేశ ప్రజల ఆమోదాన్ని సంపాదించిన అరుదైన, విలక్షణ నేత, అపర ప్రతిభావంతుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు. వాజ్ పేయి, మోదీ ప్రభుత్వాల్లో పలు శాఖలకు మంత్రిగా సేవలు అందించడమే కాకుండా, 13వ ఉపరాష్ట్రపతిగానూ ఆయన తన ప్రత్యేకతను చాటారు. రాజ్యసభ చైర్మన్ గా సభ నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. ఈ నెల 10వ తేదీతో ఆయన పదవీ కాలం ముగిసిపోతోంది.
వెంకయ్యనాయుడు పేరు చెప్పగానే ఆయన భాషా ప్రావీణ్యమే ముందుకు గుర్తుకు వస్తుంది. గొప్ప వాక్చాతుర్యం కలిగిన నాయకుడు. ‘‘మై ఆపరేషన్ డిపెండ్స్ ఆన్ యువర్ కోపరేషన్, అదర్ వైజ్ దేర్ విల్ బీ సెపరేషన్’’ (సభా నిర్వహణ అన్నది మీ సహకారంపైనే ఆధారపడి ఉంటుంది. లేదంటే అది వేరుగా ఉంటుంది) రాజ్యసభ చైర్మన్ గా ఐదేళ్ల క్రితం బాధ్యతలు స్వీకరించిన సమయంలో వెంకయ్యనాయుడు ఇచ్చిన కొటేషన్ ఇది. తన పదాల వరుస కట్టు, మాటలతో ఆయన సభలో నవ్వులు పూయిస్తూనే ఉంటారు. వెంకయ్య సభా నిర్వహణ ఎక్కువ మందిని మెప్పించిందనే చెప్పుకోవాలి.
ఓ సభ్యుడు గడ్డం గుబురుగా పెంచుకుని రావడాన్ని చూసిన ఆయన.. అది గడ్డమా? లేక మాస్కా..? అని వ్యంగ్యంగా అడిగి సభలో నవ్వుల వాతావరణం సృష్టించారు ఓ సందర్భంలో. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల ఆందోళన, నిరసనతో వేడెక్కినా.. దాన్ని అంతే వేగంగా తన తీరుతో మార్చేయగలరు.
రాజ్యసభలో ఉత్పాదకత పెంచారు. అంటే ఆయన ఐదేళ్ల పదవీ కాలంలో సభలో సభ్యుల హాజరు శాతాన్ని పెంచారు. మాతృభాషలో ప్రసంగించడాన్ని ప్రోత్సహించారు. సభ నిర్వహణ మెరుగుపడేందుకు ఆయన తీసుకున్న చర్యలు ఏంటో నేడు ప్రధాని ఆవిష్కరించనున్న 2017-2022 పుస్తకంలో చోటు కల్పించారు. వలసకాలం నాటి విధానాలకు స్వస్తి చెప్పారు. సభ మెరుగైన నిర్వహణకు టెక్నాలజీ వినియోగించారు. 2019లో 52 బిల్లులు ఆమోదం పొందడం అన్నది 36 ఏళ్లలోనే అత్యధిక రికార్డు.
ఆయన పదవీ కాలంలో సభ ప్రతిష్ఠంభనకు దారితీసిన ప్రధాన అంశాల్లో ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైతుల చట్టాలు, పెగాసస్ స్పైవేర్ నిలుస్తాయి. ‘‘వెంకయ్యనాయుడు రాజ్యాంగ పదవిలో ఉన్నా.. ఆయన హృదయం బీజేపీ కోసం కొట్టుకుంటూనే ఉంటుంది’’ అన్నది ఆయన విమర్శకుల నుంచి వినిపించే మాట. నిజమే కావచ్చు. ఎందుకంటే బీజేపీతో ఆయన బంధం దశాబ్దాలుగా సుస్థిరమైనది. ఉపరాష్ట్రపతి స్థానంలోకి రావడానికి ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ ఆయన సేవలు అందించారు. బీజేపీలో అందరూ మెచ్చే నేతగా, పార్టీలో సంక్షోభాల పరిష్కర్తగా ఆయనకు పేరు.
ఒకప్పటి నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జూలై 1 జన్మించిన వెంకయ్యనాయుడు. ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయవాద డిగ్రీ కోర్సులో చేరే నాటికి ఆర్ఎస్ఎస్ పరిచారక్ గా, ఏబీవీపీ నేతగా చురుగ్గా పనిచేసేవారు. 1978, 1983లో జనతా పార్టీ తరఫున ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1988లో బీజేపీ ఆంధప్రదేశ్ అధ్యక్షుడయ్యారు. 1993లో బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి చేరిపోయారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. లోక్ సభకు పోటీ చేసినా ఆయన గెలవలేదు. దీంతో అప్పటి నుంచి రాజ్యసభ సభ్యునిగా పలు పర్యాయాలు అవకాశాలు సొంతం చేసుకున్నారు.
అద్వానీ శిష్యుడిగా నాయుడికి పేరు. 2002 గుజరాత్ లో ఘర్షణలు చోటు చేసుకున్న తర్వాత నాడు సీఎంగా ఉన్న మోదీని రాజీనామా చేయాలని ప్రధాని వాజ్ పేయి కోరారు. కానీ, ఇది అద్వానీకి ఇష్టం లేదు. దీంతో అద్వానీ నిర్ణయాన్ని వాజ్ పేయికి చెప్పి ఒప్పించింది నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వెంకయ్యనాయుడు కావడం గమనార్హం. ఆ తర్వాత కాలంలో మోదీ ప్రధాన మద్దతు దారుల్లో వెంకయ్య ఒకరిగా మెలిగారు. 2016లో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశంలో ‘భారత్ కు దేవుడిచ్చిన కానుక మోదీ’ అంటూ అభివర్ణించారు.
మోదీ సర్కారు మొదటి హయాంలో పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పేదరిక నిర్మూలన శాఖల బాధ్యతలు చూశారు. సమాచార శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. పార్లమెంటరీ నేతగా, పాలన, రాజ్యాంగ వ్యవహారాల్లో అపార విజ్ఞానం ఉన్న వెంకయ్యనాయుడిని ఈ విడత రాష్ట్రపతిగా ప్రమోట్ చేస్తారని ఎక్కువ మంది అంచనా వేశారు. కానీ, రాజకీయ సమీకరణాల కోణంలో ఆయనకు ఆ అవకాశం రాకుండా పోయింది.
ఐదేళ్ల క్రితం ఉపరాష్ట్రపతిగా ఆయనకు అవకాశం కల్పించినప్పుడు.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పార్టీని వీడడం అమ్మను విడిచి వెళ్లడమే అంటూ తన బాధను వ్యక్తం చేశారు. బీజేపీ అంటే ఆయనకు పంచ ప్రాణాలే అని చెప్పుకోవాలి. మరి పదవీ విరమణ తర్వాత వెంకయ్యనాయుడు ప్రస్థానం ఎలా సాగుతుందన్నది ఎంతో మందికి ఆసక్తిని కలిగిస్తోంది. వెంకయ్య కుమార్తె నిర్వహణలో స్వర్ణభారతి ట్రస్ట్ కొనసాగుతోంది. మరి వెంకయ్య ట్రస్ట్ నిర్వహణలో ప్రత్యక్షంగా పాలు పంచుకుంటారా? అన్నది చూడాలి.