Bapatla: బహిరంగ మల విసర్జనను నిరోధించడంలో ఆదర్శంగా నిలుస్తున్న బాపట్ల జిల్లాలోని గ్రామం!

Gonasapudi Transforms as swachh Village

  • సత్ఫలితాలనిస్తున్న గ్రామస్థుల కృషి
  • స్వచ్ఛ గ్రామంగా రూపుదిద్దుకున్న గొనసపూడి
  • బహిరంగ మలవిసర్జన చేసే వారికి జరిమానా
  • మైకుల్లో ప్రచారం.. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని గొనసపూడి గ్రామం గాంధీ కలలుగన్న స్వచ్ఛ గ్రామంగా రూపుదిద్దుకుంటోంది. గతేడాది జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజున ఇందుకు తొలి అడుగు పడగా ఏడాదిలోనే కల సాకారం అవుతోంది. 

గొనసపూడిని స్వచ్ఛ గ్రామంగా నిలపాలని కంకణం కట్టుకున్న గ్రామ పెద్దలు ఊరి చుట్టూ 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరు బయట మలవిసర్జనను నిర్మూలించారు. పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దని గ్రామస్థులకు హితబోధ చేశారు. నిత్యం పర్యవేక్షిస్తూ 650 ఇళ్లున్న ఈ చిన్న ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. 

2,500 మంది నివసించే గొనసపూడిని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని నిర్ణయించే నాటికి గ్రామంలో 580 ఇళ్లలో మాత్రమే మరుగుదొడ్లు ఉండేవి. మిగతా వారు ఆరు బయట మలమూత్ర విసర్జన చేసేవారు. దీనిని పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించిన పెద్దలు, సర్పంచ్ దీప్తి భర్త, పారిశ్రామికవేత్త విక్రం నారాయణరావు పక్కా ప్రణాళిక రూపొందించారు. 

ఈ క్రమంలో మరుగుదొడ్లు నిర్మించుకునే స్తోమత లేని 25 మందికి రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. స్థలం లేని వారికి, విద్యార్థులకు, ఉపాధ్యాయుల కోసం ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ పాఠశాల్లో 9 మరుగుదొడ్లు నిర్మించి తాళం చెవులను వారికే అందించారు. అలాగే, సచివాలయ సిబ్బంది, పాలకవర్గం, అక్కడికొచ్చే ప్రజల కోసం దాదాపు రూ. 2 లక్షలతో ఆధునిక మరుగుదొడ్లను నిర్మించారు. ఇందుకు అవసరమైన నిధుల్లో దాదాపు రూ. 7 లక్షలు నారాయణరావు అందించారు.

గ్రామాన్ని స్వచ్ఛంగా తీర్చిద్దాలని కలలగన్నప్పటికీ కొందరు గ్రామస్థులు ఇంకా ఆరుబయటే మలమూత్ర విసర్జన చేస్తుండడంతో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న గ్రామ యువకులను పిలిపించి వారిని ప్రతి ఇంటికి పంపి అవగాహన కల్పించారు. అంతేకాదు, ఇకపై బహిరంగ మలవిసర్జనకు రూ. 500 జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుందని నిబంధన పెట్టారు. కరపత్రాలు ముద్రించి ప్రచారం చేశారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టేందుకు రూ. 6 లక్షలు ఖర్చు చేసి గ్రామం చుట్టూ 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో బయట మలవిసర్జనకు వెళ్తూ 25 మంది సీసీ కెమెరాలకు చిక్కారు. వీరి నుంచి జరిమానా వసూలు చేశారు. చెంబులు, నీళ్ల డబ్బాలతో బయట కనిపించే వారిని డబ్బారాయుళ్లుగా మైకుల్లో ప్రచారం చేస్తుండడంతో బయట మలవిసర్జనను మానేశారు. మద్యం తాగడం కూడా తగ్గింది. ఈ ఏడాది గాంధీ జయంతి నాటికి 100 శాతం బహిరంగ మలమూత్ర విసర్జనను నిర్మూలిస్తామని నారాయణరావు చెప్పారు. స్వచ్ఛ గొనసపూడి కోసం నెలకు దాదాపు రూ. 80 వేల సొంత నిధులు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News