Commonwealth Games: కామన్వెల్త్ క్రీడల్లో భవీనా పటేల్ సరికొత్త చరిత్ర.. టీటీలో గోల్డ్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డ్!
- కామన్వెల్త్ క్రీడల్లో నిన్న భారత్‌కు 11 పతకాలు
- ముచ్చటగా మూడో టైటిల్ గెలుచుకున్న వినేష్ ఫొగట్
- 40 పతకాలతో పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకిన భారత్
కామన్వెల్త్ క్రీడల్లో రికార్డులు కొల్లగొడుతున్న భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్ భారత్‌కు స్వర్ణ పతకం అందించింది. పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ 3-5 కేటగిరీలో దేశానికి పసిడి పతకం తీసుకొచ్చింది. నైజీరియాకు చెందిన క్రిస్టియానాతో జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల భవినా 3-0తో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
ఇక, కామన్వెల్త్ గేమ్స్ తొమ్మిదో రోజైన నిన్న భారత్ ఖాతాలో మొత్తంగా మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 11 పతకాలు చేరాయి. రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత రవికుమార్ దహియా కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. 2014, 2018 కామన్వెల్త్ క్రీడల్లో వినేష్ ఫొగట్ ముచ్చటగా మూడో టైటిల్ గెలుకుంది.
తాజా పతకాలతో కలుపుకుని భారత్ మొత్తంగా 40 పతకాలు సాధించి పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. వీటిలో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత బాక్సర్లు అమిత్ పంఘల్, నిఖత్ జరీన్ ఇప్పటికే పతకాలు ఖాయం చేయగా, క్రికెట్‌లో టీమిండియా అమ్మాయిలు ఫైనల్‌కు చేరుకుని కనీసం రజత పతకం ఖాయం చేశారు.