Arpita Mukherjee: జైల్లో అర్పిత ముఖర్జీ ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తున్న ఈడీ... కోర్టుకు విన్నపం
- టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంలో అరెస్టయిన అర్పిత
- మాజీమంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలిగా గుర్తింపు
- అర్పిత నివాసాల్లో రూ.49 కోట్ల లభ్యం
- పార్థ ఛటర్జీ, అర్పితలకు 14 రోజుల రిమాండ్
పశ్చిమ బెంగాల్ లో తీవ్ర కలకలం రేపిన ఉపాధ్యాయ ఉద్యోగాల కుంభకోణంలో ప్రధాన నిందితులు పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీలకు కోల్ కతా ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం తెలిసిందే. అయితే, జైల్లో అర్పిత ముఖర్జీ ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఈ కేసును విచారిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుమానిస్తోంది. దీంతో జైల్లో ఆమెకు అందించే ఆహారం, తాగునీరును ముందుగా పరీక్షించేలా ఆదేశాలు ఇవ్వాలని ఈడీ ప్రత్యేక కోర్టును కోరింది.
అంతకుముందు, అర్పిత తరఫు న్యాయవాది ఈ అంశాన్ని కోర్టుకు విన్నవించారు. తన క్లయింటుకు జైల్లో మరింత భద్రత ఏర్పాటు చేయాలని, ఆమె తినే ఆహారం, తాగునీటిని ముందుగానే పరీక్షించేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అర్పిత ముఖర్జీ న్యాయవాది వాదనలతో ఈడీ న్యాయవాది కూడా ఏకీభవించారు. ఆమెను ఉంచిన గదిలో నలుగురు ఖైదీల కంటే ఎక్కువమందిని ఉండనివ్వరాదని కోర్టును కోరారు.