TTD: ఈ నెల 21న ముంబైలో వెంకన్న ఆలయానికి భూమి పూజ... షిండే, ఫడ్నవీస్, థాకరేకు వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానం
- ముంబైలో నూతనంగా వెంకన్న ఆలయం
- ఆలయ భూమి పూజకు రంగం సిద్ధం
- ఆహ్వానాలు అందిస్తూ సాగుతున్న సుబ్బారెడ్డి బృందం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో మహారాష్ట్ర రాజధాని ముంబైలో నూతనంగా శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కానుంది. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి నిధులు, భూమి కేటాయింపు తదితరాలన్నీ పూర్తి కాగా... ఈ నెల 21న ఆలయానికి భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఏ ఒక్కరిలో అసంతృప్తి చెలరేగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. మహారాష్ట్రలోని దాదాపుగా అన్ని పార్టీలకూ టీటీడీ ఆహ్వానాలు పంపుతోంది.
ఆలయ భూమి పూజ కార్యక్రమానికి కీలక నేతలను ఆహ్వానించే నిమిత్తం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు శనివారం ముంబై చేరుకున్నారు. తొలుత అధికారిక కూటమి అయిన బీజేపీ, శివసేన షిండే వర్గం వద్దకు వెళ్లిన సుబ్బారెడ్డి బృందం సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లకు ఆహ్వాన పత్రికలు అందించారు. ఆ తర్వాత శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీకి వెళ్లిన సుబ్బారెడ్డి బృందం మాజీ మంత్రి ఆదిత్య థాకరేకు ఆహ్వాన పత్రిక అందజేసింది.