Miftah Ismail: రానున్న రోజుల్లో కష్టాల కడగండ్లు తప్పవు: పాక్ ఆర్థికమంత్రి హెచ్చరిక

Pakistan FM Miftah Ismail warns bad days ahead
  • పాక్ లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం
  • మరో మూడు నెలలు ఆంక్షలు తప్పవన్న ఆర్థికమంత్రి
  • ఇమ్రాన్ ఫ్రభుత్వమే కారణమని ఆరోపణ
పాకిస్థాన్ లో సంక్షోభ పరిస్థితులపై ఆ దేశ ఆర్థికమంత్రి మిఫ్తా ఇస్మాయిల్ స్పందించారు. రానున్న రోజుల్లో పాక్ మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వచ్చే మూడు నెలల పాటు దిగుమతులపై కోత తప్పదని స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుస్థితికి గత తెహ్రీకే ఇన్సాఫ్ ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణమని మిఫ్తా ఇస్మాయిల్ ఆరోపించారు. 

అంతకుముందు పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ప్రభుత్వ హయాంలో బడ్జెట్ లోటు 1,600 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ లోటు ఒక్కసారిగా 3,500 బిలియన్ డాలర్లకు పెరిగిందని మిఫ్తా ఇస్మాయిల్ వివరించారు. ఇలాంటి ద్రవ్య ఖాతాల లోటుతో ఏ దేశం కూడా సుస్థిర అభివృద్ధి సాధించలేదని అభిప్రాయపడ్డారు. 

సాధారణంగానే ఆర్థిక ఒడిదుడుకులతో ప్రస్థానం కొనసాగించే పాక్ ను కరోనా వ్యాప్తి తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా దెబ్బకు కుదేలైన దేశాల్లో పాక్ కూడా ఒకటి. కరోనా వైరస్ ను పాక్ దీటుగానే ఎదుర్కొన్నప్పటికీ, ఆ మహమ్మారి ప్రభావంతో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని పాక్ నియంత్రించలేకపోయింది.
Miftah Ismail
Finance Minister
Pakistan
Imports
Crisis

More Telugu News