Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన రాజ‌గోపాల్ రెడ్డి... కాంగ్రెస్ కోస‌మే ప‌ని చేసే వెంక‌ట్‌రెడ్డి... ఇద్ద‌రూ వేరు: రేవంత్ రెడ్డి

revanth reddy clarity on his comments on rajagopal reddy

  • అపోహ‌తో మా వెంక‌న్న మ‌న‌స్తాపం చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్న రేవంత్‌
  • త‌న‌కు, వెంక‌ట్‌రెడ్డికి మ‌ధ్య అగాథం సృష్టించేందుకు కొంద‌రు య‌త్నిస్తున్నార‌ని ఆరోప‌ణ‌
  • రాజ‌గోపాల్ రెడ్డిపై త‌న‌ వ్యాఖ్య‌ల‌కు వెంక‌ట్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేద‌ని వివ‌ర‌ణ‌

కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా వ్య‌వ‌హారం తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద ర‌చ్చ‌నే సృష్టించింది. అన్ని అవ‌కాశాలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజ‌గోపాల్ రెడ్డి పార్టీకి ద్రోహం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆయ‌న‌పై టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో వెంక‌ట్ రెడ్డిని చ‌ల్ల‌బ‌రిచే దిశ‌గా శుక్ర‌వారం రేవంత్ రెడ్డి స్పందించారు.  

కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన రాజ‌గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ కోస‌మే ప‌ని చేసే వెంక‌ట్ రెడ్డి ఇద్ద‌రూ వేరు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను రాజ‌గోపాల్ రెడ్డిపై చేసిన వ్యాఖ్య‌ల‌తో వెంక‌ట్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వెంక‌ట్ రెడ్డికి, త‌న‌కు మ‌ధ్య అగాథం సృష్టించేందుకు కొంద‌రు య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల అపోహ‌తో మా వెంక‌న్న మ‌న‌స్తాపం చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. రాజ‌గోపాల్ రెడ్డి త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని రేవంత్ స‌వాల్ విసిరారు. రాజ‌గోపాల్ రెడ్డి కాంట్రాక్టులు, గ‌డ‌చిన 8 ఏళ్ల‌లో ఆయ‌న కేసీఆర్‌పై చేసిన పోరాటం గురించి మునుగోడులో మాట్లాడ‌తాన‌ని కూడా రేవంత్ రెడ్డి అన్నారు.

More Telugu News