Jharkhand: ట్రాక్టర్ నడిపి వ్యవసాయం చేసిన యువతి.. ఊరికి అరిష్టమంటూ పంచాయతీ.. సాంఘిక బహిష్కరణ!

jharkhand fatwa of panchayat against the girl driving the tractor

  • ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఘటన
  • బీఏ పార్ట్ వన్ చదువుతున్న మంజు ఒరాన్
  • ఆధునిక పద్ధతిలో వ్యవసాయం ప్రారంభించిన మంజు
  • ఆమె తీరును జీర్ణించుకోలేకపోయిన గ్రామస్థులు 
  • జరిమానా చెల్లించి, క్షమాపణలు చెప్పాలన్న పంచాయతీ
  • బెదిరేదే లేదంటున్న యువతి

కుటుంబాన్ని ఆదుకునేందుకు ట్రాక్టర్ నడుపుతూ పొలం పనులు చేస్తున్న యువతిపై గ్రామస్థులు కక్షగట్టారు. మగరాయుడులా ఆమె ట్రాక్టర్ నడుపుతుండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు. పంచాయతీ పెట్టి మరీ బాలికకు జరిమానా విధించారు. అది చెల్లించకుంటే గ్రామం నుంచి బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే, పంచాయతీ ఆదేశాలకు యువతి బెదిరిపోలేదు. ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా సిసాయి బ్లాక్‌లోని దహుటోలి గ్రామంలో జరిగిందీ ఘటన. 

పంచాయతీ ఆదేశాలను తోసిరాజన్న ఆ అమ్మాయి పేరు మంజు ఒరాన్. గుమ్లాలోని కార్తీక్ ఒరాన్ కాలేజీలో బీఏ పార్ట్ వన్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు రైతులు. వారి కుటుంబానికి ఆరెకరాల సాగుభూమి ఉంది. కొన్నేళ్లుగా సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తున్న వీరికి నీటి పారుదల సౌకర్యాలు, సరికొత్త వ్యవసాయ పద్ధతులపై ఎంతమాత్రమూ అవగాహన లేదు. దీంతో మంజు సాంకేతిక సాయంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంది. 

ఈ క్రమంలో రెండేళ్ల క్రితం గ్రామంలో మరో పదెకరాల భూమిని ఆ కుటుంబం కౌలుకు తీసుకుంది. వరి, మొక్కజొన్న, టమాటా, బంగాళదుంప తదితర పంటల సాగులో మంచి ఫలితాలు రావడంతో మంజు ఈ ఏడాది వ్యవసాయం కోసం పాత ట్రాక్టర్‌ను కొనుగోలు చేసింది. 

మంజు స్వయంగా ఆ ట్రాక్టర్ దున్నుతూ వ్యవసాయం చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు గ్రామంలో మరే మహిళా ఇలాంటి ధైర్యం చేయలేదు. ఇది చూసి గ్రామస్థులు విస్తుపోయారు. సరికొత్త పద్ధతుల్లో సాగు ప్రారంభించిన మంజును చూసిన గ్రామస్థులు జీర్ణించుకోలేక, పంచాయతీ పెట్టారు. 

ఇప్పటి వరకు గ్రామంలో ఎవరూ చేయని పనిని మంజు చేసిందని, ఇది గ్రామానికి విపత్తును తెచ్చి పెడుతుందని, కరవు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గ్రామస్థులు ముక్తకంఠంతో చెప్పుకొచ్చారు. కట్టుబాట్లను ఉల్లంఘించి ట్రాక్టరెక్కి పొలం దున్నినందుకు జరిమానా విధించిన పంచాయతీ, క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. అలా చేయకుంటే సాంఘిక బహిష్కరణ తప్పదని హెచ్చరించింది. 

అయితే, మంజు మాత్రం బెదిరిపోలేదు. ప్రగతిశీల రైతుగానే ఉంటానని చెప్పుకొచ్చింది. భూమిని సాగు చేయడం నేరం ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నించింది. తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, తన పని తాను చేసుకుంటూనే ఉంటానని తేల్చిచెప్పింది. మంజు నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.

  • Loading...

More Telugu News