Nalgonda District: మునుగోడులో బైక్‌పై వెళ్తున్న యువకుడిపై దుండగుల కాల్పులు

miscreants fired three rounds on a realtor in Munugode nalgonda dist

  • మునుగోడులో వ్యాపారం చేస్తున్న లింగస్వామి
  • కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువకుడు
  • కామినేని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి (32)కి మునుగోడులో కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్ వ్యాపారం ఉంది. దీంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు. గత రాత్రి దుకాణం మూసేసి బ్రాహ్మణవెల్లంలలోని తన ఇంటికి బయలుదేరాడు. సింగారం శివారు దాటగానే గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి లింగస్వామిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో లింగస్వామి కుప్పకూలిపోయాడు.

చనిపోయి ఉంటాడని భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడికి సమీపంలోనే ఉన్న ఓ వ్యక్తి కాల్పుల శబ్దం విని అక్కడికొచ్చాడు. రక్తపు మడుగులో పడివున్న లింగస్వామిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారకస్థితిలో ఉన్న లింగస్వామిని నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News