YSRCP: కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం: ఏపీ సీఎం వైఎస్ జగన్

- తాడేపల్లిలో జరిగిన తొలి భేటీ
- కుప్పం నుంచి 50 మంది నేతలను పిలిచిన అధిష్ఠానం
- మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్‌లు హాజరు
ఏపీలో శాసనసభ నియోజకవర్గాలకు చెందిన స్థానిక నేతలతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా తొలి భేటీని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ నేతలతో జగన్ ప్రారంభించారు. కుప్పం నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమని ఆయన అన్నారు. గడచిన మూడేళ్లలో కుప్పంకు అత్యధిక మేలు జరిగిందని కూడా ఆయన చెప్పారు. కుప్పం మునిసిపాలిటీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని జగన్ పిలుపునిచ్చారు.