Diabetes: మధుమేహానికి అల్ట్రా సౌండ్ చికిత్స.. బాధాకర ఇంజెక్షన్లు, మందులు అవసరం లేదు!

Yale researchers found a cure for diabetes using ultrasound

  • జీఈ కంపెనీ రూపొందించిన విధానం ఆధారంగా ఆధునిక చికిత్స
  • యేల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రూపొందించిన శాస్త్రవేత్తలు
  • మధుమేహం తగ్గడమే కాదు.. ఆ సమస్య రావడానికి ముందున్న స్థితికి చేరవచ్చని వెల్లడి

మధుమేహం.. షుగర్.. ఎలా పిలిచినా ఒకసారి దాని బారిన పడ్డామంటే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్క మందులే కాదు.. ఆహారం విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) పరిశోధకులు రూపొందించిన ఓ విధానం ఆధారంగా యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మధుమేహానికి వినూత్నమైన చికిత్సను అభివృద్ధి చేశారు.

కేవలం అతి ధ్వనులు (అల్ట్రా సౌండ్) సాయంతో రక్తంలో గ్లూకోజు మోతాదులను తగ్గించే విధానాన్ని రూపొందించారు. అంతేకాదు.. అసలు మధుమేహం బారిన పడక ముందు ఉన్నట్టుగా శరీరం ఆరోగ్యవంతం అయ్యేలా చేయవచ్చనీ వారు అంటున్నారు. యేల్ యూనివర్సిటీతోపాటు పలు ఇతర సైన్స్, ఇంజనీరింగ్ సంస్థల శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. నేచర్ బయో మెడికల్ జర్నల్ లో దీనికి సంబంధించిన వివరాలు ప్రచురితం అయ్యాయి.

కోట్లాది మందికి ప్రయోజనం..
ప్రస్తుతం  ప్రపంచ వ్యాప్తంగా 65 కోట్ల మందికిపైగా ఊబకాయంతో బాధపడుతున్నట్టు అంచనా. అలాంటి వారిలో చాలా మంది మధుమేహంతోపాటు గుండె జబ్బులు వంటి ఇతర ఆరోగ్య సమస్యల బారినపడేందుకు అవకాశాలు ఎక్కువ. అయితే మధుమేహానికి ఇప్పుడున్న చికిత్సలన్నీ కూడా తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. కేవలం దానిని నియంత్రణలో ఉంచడానికి మాత్రమే తోడ్పడుతాయి. ఈ క్రమంలో జీఈ, యేల్ వర్సిటీ శాస్త్రవేత్తలు పూర్తిగా మధుమేహాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. ఇది కోట్లాది మందికి ప్రయోజనం కలిగించనుంది.

నాడులపై అల్ట్రా సౌండ్ ప్రయోగం ద్వారా..
ఊబకాయుల్లో సైటోకైన్‌ ప్రొటీన్ల వంటి వాటి వల్ల రక్తంలో షుగర్ స్థాయులు పెరుగుతాయి. ఇన్సులిన్‌ నిరోధకత, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. వారి శరీరం బరువు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ఓ ప్రధాన నాడి పనితీరు దెబ్బతింటుంది. జీర్ణక్రియల్లో కూడా తేడాలు ఏర్పడుతాయి. ఈ క్రమంలో సంబంధిత నాడులను సున్నితంగా ప్రేరేపించడం వల్ల.. వాటి పనితీరును పెంచగలమని, తద్వారా మధుమేహానికి చెక్‌ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు.

  • అల్ట్రా సౌండ్ తరంగాలను నాడులపై నిర్ణీత చోట్ల ప్రసరించడం ద్వారా న్యూరాన్లు చైతన్యవంతం అవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ నాడులు యాక్టివ్ గా మారడం వల్ల సంబంధిత జీవ క్రియలు వేగవంతం అవుతున్నాయని తేల్చారు.
  • ఈ నేపథ్యంలో అల్ట్రా సౌండ్ తరంగాలను ఉపయోగించి.. శరీరంలో ఇన్సులిన్‌, చక్కెర మోతాదులను నియంత్రించవచ్చని వివరించారు.
  • ప్రస్తుతం జంతువులపై దీనికి సంబంధించి పరిశోధన చేస్తున్నామని, మనుషుల్లో ప్రయోగాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
  • ఏ స్థాయిలో అల్ట్రా సౌండ్ ను, ఏయే చోట్ల వినియోగిస్తే.. ఎలాంటి ఫలితాలు ఉంటాయి, దీనివల్ల దుష్పరిణామాలు ఏమైనా ఉంటాయా అన్నది క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని వివరిస్తున్నారు.
  • ఒకసారి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తే.. మధుమేహానికి ఇంజెక‌్షన్లు, మందులు అవసరం ఉండకుండా చికిత్సను అభివృద్ధి చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు.
  • రోజుకు మూడు, నాలుగు నిమిషాల పాటు అల్ట్రా సౌండ్ ను ప్రసరించడం ద్వారా మధుమేహం పూర్తి నియంత్రణలో ఉంటుందని తమ పరిశోధనల్లో తేలిందని పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News