Kankipadu: కంకిపాడు స్కూలు విద్యార్థినుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు!
- మూడు రోజుల క్రితం స్కూలు నుంచి అదృశ్యమైన బాలికలు
- నటనపై ఆసక్తితోనే వెళ్లిపోయి ఉంటారని అనుమానం
- చెన్నై, హైదరాబాద్‌లలో ప్రత్యేక బృందాల గాలింపు
- నిందితుడు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉంటాడని అనుమానం
- కంకిపాడు నుంచి విజయవాడ రైల్వే స్టేషన్‌కు బైక్‌పై తీసుకెళ్లిన నిందితుడు
కృష్ణా జిల్లా కంకిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల అదృశ్యంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, టీవీల్లో నటించాలన్న కోరికతో వారే ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఈ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అదృశ్యమైన ఇద్దరు బాలికలకు నటన అంటే ఎంతో ఇష్టం. ఇద్దరిలో ఓ అమ్మాయి ఇటీవల తల్లితో కలిసి ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు వెళ్లింది. ఆడిషన్స్‌లో ఆమె మెప్పించినప్పటికీ చిన్న వయసు కావడంతో తర్వాత చూద్దామని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. అదృశ్యమైన మరో బాలికకు టిక్‌టాక్‌లో వీడియోలు చేసే అలవాటుంది. వీరి ఆసక్తిని గమనించిన జోజి అనే పొరుగింటి వ్యక్తి మాయమాటలు చెప్పి నమ్మించి వారిని తీసుకెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. నిందితుడి భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లడంతో దీనిని అదునుగా తీసుకుని టీవీల్లో అవకాశాలు ఇప్పిస్తానని వారిని తీసుకెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు.
మరోవైపు, తమకు టీవీల్లో ఆఫర్లు వస్తున్నాయని, త్వరలోనే హైదరాబాద్ వెళ్తామని బాలికలు తమ స్నేహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, నిందితుడితో తమ కుమార్తెకు పరిచయం లేదని, అతడే ప్రేరేపించి తీసుకెళ్లి ఉంటాడని ఓ అమ్మాయి తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలికలను తీసుకెళ్లాలని ముందుగానే నిర్ణయించుకున్న నిందితుడు రూ. 20 వేల నగదును తీసుకెళ్లినట్టు గుర్తించారు. అలాగే, బాలికలు కూడా డబ్బుల కోసం తమ పుస్తకాలను స్కూలు సమీపంలో ఉన్న పాతసామాన్లు కొనే బండిలో విక్రయించారు.
విద్యార్థులను నిందితుడు కంకిపాడు నుంచి బైక్‌పై విజయవాడ రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లినట్టు సీసీటీవీల్లో రికార్డైంది. అయితే, అక్కడి నుంచి వారు ఎటువైపు వెళ్లారన్న విషయం తెలియరాలేదు. రైల్వే స్టేషన్‌లోనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో గుర్తించడం కష్టంగా మారింది. మరోవైపు, రోజులు గడుస్తున్నా విద్యార్థినుల ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.