Team India: కామన్వెల్త్ గేమ్స్: బార్బడోస్‌ను చిత్తుగా ఓడించి సెమీస్‌కు చేరిన టీమిండియా అమ్మాయిలు

India women enters semis in commonwealth games
  • ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన హర్మన్‌ప్రీత్ సేన
  • జెమీమా రోడ్రిగ్స్ అజేయ అర్ధ సెంచరీ
  • 100 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్
కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా బార్బడోస్‌తో జరిగిన కీలక టీ20 మ్యాచ్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఆల్‌రౌండర్ ప్రతిభతో ప్రత్యర్థిని చిత్తుచేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సెమీస్‌కు దూసుకెళ్లింది. పాకిస్థాన్‌పై గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో ఊపుమీదున్న టీమిండియా అమ్మాయిలు బార్బడోస్‌పై 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి కొండంత ఆత్మవిశ్వాసంతో సెమీస్‌కు దూసుకెళ్లారు. భారత్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బార్బడోస్‌ను 62 పరుగులకే కట్టడిచేసిన బౌలర్లు భారత్‌కు ఘన విజయాన్ని అందించారు.

రేణుకా సింగ్ పదునైన బంతులను ఎదురొడ్డలేని బార్బడోస్ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు క్యూ కట్టారు. బార్బడోస్ జట్టులో కైషోనా నైట్ చేసిన 16 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. 9 మంది ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. షంకేరా సెల్మాన్ చేసిన 12 పరుగులు రెండో అత్యధిక వ్యక్తిగతం. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీసుకోగా, మేఘనా సింగ్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్మన్ ప్రీత్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ అజేయ అర్ధ సెంచరీ (56) సాధించగా, షెఫాలీ వర్మ (43), దీప్తి శర్మ (34) రాణించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగింది. ఈ విజయంతో భారత జట్టు గ్రూప్-ఏ లో సెమీస్‌కు దూసుకెళ్లింది.
Team India
Barbados
Harmanpreet Kaur
Jemimah Rodrigues

More Telugu News