Congress: రేవంత్ రెడ్డీ, న‌న్ను అన‌వ‌స‌రంగా రెచ్చ‌గొట్టొద్దు!... కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వార్నింగ్‌!

congress mp komatireddy venkat reddy wrns tpcc chief revanth reddy

  • రాజగోపాల్ రెడ్డి వ్య‌వ‌హారంపై స్పందించ‌నన్న వెంక‌ట‌రెడ్డి
  • త‌న‌కు ఇష్ట‌మున్న పార్టీలోకి రాజ‌గోపాల్ రెడ్డి వెళ్లార‌ని వ్యాఖ్య‌
  • త‌మ‌ను అవ‌మానించేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించార‌ని ఆరోప‌ణ‌
  • రేవంత్ రెడ్డి త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్‌

కాంగ్రెస్ పార్టీకి, న‌ల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తూ మంగ‌ళ‌వారం కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగతి విదితమే. అయితే, ఆయన సోద‌రుడు, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తాజాగా మాటలాడుతూ, రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారంపై తాను స్పందించేది లేద‌ని స్పష్టం చేశారు. ఈ వ్య‌వ‌హారంలో ఏది ఉన్నా రాజ‌గోపాల్ రెడ్డినే అడ‌గాలంటూ ఆయ‌న మీడియాకు తెలిపారు. రాజ‌గోపాల్ రెడ్డి త‌న‌కు ఇష్ట‌మున్న పార్టీలోకి వెళ్లిపోయార‌ని ఆయ‌న చెప్పారు.

ఈ మేర‌కు బుధ‌వారం రాత్రి ఢిల్లీలో మీడియాతో వెంక‌ట‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ అవ‌కాశాలు ఇవ్వ‌కుంటే... బ్రాందీ షాపుల్లో ప‌నిచేయ‌డానికి కూడా ప‌నికి రారంటూ రాజ‌గోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై వెంక‌ట‌రెడ్డి ఘాటుగా స్పందించారు. త‌మ కుటుంబం బ్రాందీ వ్యాపారం చేస్తోందంటూ వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ రెడ్డి త‌మ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

పార్టీ మారిన స‌మ‌యంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారా? అని కూడా వెంక‌ట‌రెడ్డి ప్ర‌శ్నించారు. త‌న వ్యాఖ్య‌ల‌తో రేవంత్ రెడ్డి త‌నను అనుమానిస్తున్నారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి త‌న‌ను అన‌వ‌స‌రంగా రెచ్చ‌గొట్టొద్ద‌ని వెంక‌ట‌రెడ్డి హెచ్చ‌రించారు.

More Telugu News