Komatireddy Raj Gopal Reddy: రేవంత్​ చిల్లర దొంగ.. అవకాశ వాది​.. తెలంగాణ కాంగ్రెస్​ భూస్థాపితం అవుతుంది: రాజగోపాల్​ రెడ్డి ఫైర్

Komatireddy Rajagopal reddy fires on revanth reddy
  • కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతున్నాననే ఆరోపణలు సరికాదన్న కోమటిరెడ్డి 
  • రేవంత్‌ తమ పార్టీలోకి వచ్చి తమనే తప్పుపట్టాడని మండిపాటు
  • సీఎం అయ్యి రాష్ట్రాన్ని దోచుకోవాలనుకుంటున్నారని ఆరోపణ
  • రేవంత్ వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతందని వ్యాఖ్య
రేవంత్‌ రెడ్డి తమ పార్టీలోకి వచ్చి తమనే తప్పుపడుతున్నారని.. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తితో ఎలా కలిసి పనిచేస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యి రాష్ట్రాన్ని దోచుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. 

తాను కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతున్నానని రేవంత్ అంటున్నారని.. ఈ విషయం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజగోపాల్‌ రెడ్డి సవాల్ చేశారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ ఆయనపై పలు ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

రేవంత్ పీసీసీ పదవి వదులుకుంటారా?
కాంట్రాక్టుల కోసం తాను పార్టీ మారుతున్నట్టు రేవంత్ మాట్లాడుతున్నారని.. దీనిని నిరూపించాలని రాజగోపాల్ రెడ్డి సవాల్ చేశారు. అది నిరూపించకుంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకుంటారా? అని నిలదీశారు. రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చాక తనతో మూడు గంటలు మాట్లాడినట్లు చెప్పడం అబద్ధమన్నారు. ‘‘రేవంత్‌ కు వ్యక్తిత్వం లేదు.. ఆయనో చిల్లర దొంగ.. బ్లాక్‌ మెయిలర్‌. గతంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని తిట్టారు..” అని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదు
తాను బతికున్నంత వరకు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని, ఆ పార్టీ కార్యకర్తలను విమర్శించబోనని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కేవలం తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు. రేవంత్‌ రాజకీయ అవకాశవాది అని.. ఆయన వల్ల తెలంగాణ కాంగ్రెస్‌ భూస్థాపితం అవుతుందని ఆరోపించారు.
Komatireddy Raj Gopal Reddy
Congress
TPCC President
Revanth Reddy
Telangana
Political

More Telugu News