Vijayashanti: ఆమిర్ ఖాన్ పై విమర్శలు గుప్పిస్తూ.. సౌత్ హీరోలపై సెటైర్లు వేసిన విజయశాంతి!

Vijayashanti comments on Aamir Khan and Telugu top hero

  • భారత్ లో అసహనం పెరిగిపోయిందంటూ గతంలో వ్యాఖ్యానించిన ఆమిర్
  • ఆమిర్ చిత్రాన్ని అడ్డుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం
  • ఆమిర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న మెగాస్టార్
  • నోటికొచ్చినట్టు మాట్లాడితే జనాలు ఊరుకోబోరన్న విజయశాంతి
  • ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కొందరు సౌత్ హీరోలు వ్యవహరిస్తున్నారంటూ మండిపాటు

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' చిత్రం ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. మరోవైపు, ఈ చిత్రాన్ని కొంత మంది వ్యతిరేకిస్తుండటం ఆమిర్ ను కలవరపాటుకు గురి చేస్తోంది. భారత్ లో అసహనం పెరిగి పోయిందని... ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోదామని తన భార్య తనతో చెప్పిందంటూ గతంలో ఆమిర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. 

అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందిని తీసుకొస్తున్నాయి. ఆమిర్ చిత్రాన్ని చూడొద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, తన చిత్రాన్ని అడ్డుకోవద్దని ఆమిర్ బహిరంగంగా అందరినీ కోరారు. 

మరోవైపు ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

"ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే... ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నారు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ... 2015లో ఆమిర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారు. భారత్‌లో అసహనం పెరిగిపోయిందని... ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ఆమీర్ అన్నారు. 

భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థల్లో హైందవేతరులు ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థానాల్ని పొందారో... ఇప్పటికీ పొందుతున్నారో... చరిత్రను, సమకాలీన పరిస్థితుల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. మనకి స్వాతంత్ర్యం రావడానికి ముందు, తర్వాత, నేడు... ఎప్పుడు చూసుకున్నా ఈ దేశం మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవిస్తోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ ఆమిర్‌తో సహా బాలీవుడ్‌లో సముచిత గౌరవం అందుకుంటున్న ఖాన్ త్రయాన్నే చెప్పుకోవచ్చు. 

కానీ... వాస్తవమేంటో తెలిసిన ప్రజలు ఆమిర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడంతో పాటు, ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వాణిజ్య ఉత్పత్తుల్ని కూడా బహిష్కరించారు. గతంలో ఆమిర్ నటించిన 'పీకే' సినిమాలో సైతం హిందూ వ్యతిరేకతనే... ప్రధానంగా చూపించడమేగాక, హిందూ దేవుళ్లని అవమానించారు. అప్పట్లో హిందూ సంస్థలు ఆ సినిమాని నిషేధించాలని కూడా డిమాండ్ చేశాయి. ఇలా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ అనే... ఇన్స్పిరేషనల్ మూవీతో ముందుకొచ్చారు. కానీ, ప్రజల్లో ఏమాత్రం స్ఫూర్తిని నింపే స్థితిలో లేని ఆమిర్... గతంలో చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రజలు ఆయనకి గుర్తు చేస్తూ Boycott Laal Singh Chaddha హ్యాష్ ట్యాగ్‌తో... ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నారు. 

దురదృష్టమేంటంటే.... జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు... ఆమిర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీ షోల్లో పాల్గొంటున్నారు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలి" అంటూ వ్యాఖ్యానించారు.

Vijayashanti
BJP
Aamir Khan
Bollywood
Chiranjeevi
Tollywood
Laal Singh Chaddha
  • Loading...

More Telugu News