Elon Musk: సొంతంగా ఎయిర్ పోర్టు నిర్మించుకునే యోచనలో ఎలాన్ మస్క్
- లక్షల కోట్లకు అధిపతిగా ఉన్న ఎలాన్ మస్క్
- పలు కంపెనీలతో తీరికలేని వ్యాపార కార్యకలాపాలు
- ఆస్టిన్ నగరం వెలుపల ఎయిర్ పోర్టు నిర్మించే అవకాశం
- సొంతంగా విమానాలు కలిగివున్న మస్క్
ప్రపంచ సంపన్నుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ తదితర సంస్థల అధినేత ఎలాన్ మస్క్ సొంతంగా ఓ ఎయిర్ పోర్టు నిర్మించుకోవాలని తలపోస్తున్నారు. టెక్సాస్ లోని ఆస్టిన్ నగరం వెలుపల బాస్ట్రోప్ వద్ద ఈ విమానాశ్రయం నిర్మించే అవకాశాలున్నాయి. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్, బోరింగ్ కంపెనీ కార్యాలయాలు టెక్సాస్ లోనే ఉన్నాయి. టెస్లా కార్యాలయాన్ని కూడా గత డిసెంబరులోనే సిలికాన్ వ్యాలీ నుంచి టెక్సాస్ కు మార్చారు. ఈ నేపథ్యంలో, తన కంపెనీ కార్యకలాపాల కోసం మస్క్ తరచుగా టెక్సాస్ కు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. అందుకే సొంతంగా ఎయిర్ పోర్టు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మస్క్ కు, ఆయన కంపెనీలకు సెంట్రల్ టెక్సాస్ లో భారీగా భూములున్నాయి. ఒక్క గిగా టెక్సాస్ కంపెనీ పేరిటే 2,100 ఎకరాల భూమి ఉంది. స్పేస్ ఎక్స్, బోరింగ్ కంపెనీ కూడా గత కొన్నేళ్లుగా భారీగా భూములను సమకూర్చుకున్నాయి. మస్క్ కూడా ఇటీవల ఓ ప్రసంగంలో సొంత ఎయిర్ పోర్టు గురించి సూచనప్రాయంగా వ్యాఖ్యలు చేశారు.
తన గల్ఫ్ స్ట్రీమ్ జీ650ఈఆర్ జెట్ విమానంలో తరచుగా ప్రయాణాలు చేసే ఎలాన్ మస్క్ త్వరలోనే జీ700 విమానాన్ని కొనుగోలు చేయాలని భావిస్తున్నాడట. ఈ విమానం ప్రారంభ ధరే రూ.613 కోట్ల వరకు ఉంటుంది.
సాధారణంగా అమెరికాలో ప్రైవేటు ఎయిర్ పోర్టు నిర్మించుకోవాలంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అనుమతి తీసుకోవాలి. సదరు ఏజెన్సీ నిర్దేశించిన మేరకు పర్యావరణ ప్రమాణాలు అందుకోవాల్సి ఉంటుంది. మస్క్ ఎయిర్ పోర్టు నిర్మించే ప్రాంతం బాస్ట్రోప్ లో పాలకమండలి అనుమతులు, స్థానిక ఆర్థికాభివృద్ధి సంస్థ అనుమతులు తప్పనిసరి. అయితే, ఇప్పటివరకు ఈ ప్రాంతంలో కొత్తగా ఎయిర్ పోర్టు నిర్మించేందుకు తమ వద్దకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని సదరు సంస్థలు చెబుతున్నాయి. అటు, మస్క్ ప్రతినిధులు కూడా దీనిపై ఇంకా స్పందించలేదు.