Mulugu: ములుగు జిల్లాలో న్యాయవాదిని వెంబడించి నడిరోడ్డుపై దారుణ హత్య

Hanamkonda lawyer killed in mulugu dist

  • ములుగు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన న్యాయవాది మల్లారెడ్డి
  • పని ముగించుకుని సాయంత్రం తిరిగి వెళ్తుండగా ఘటన
  • తొలుత కారును ఢీకొట్టిన నిందితులు
  • రోడ్డుపక్కనున్న పొదల్లోకి తీసుకెళ్లి హత్య
  • భూ వివాదాలే కారణమని అనుమానం

తెలంగాణలోని ములుగు జిల్లాలో హన్మకొండకు చెందిన సీనియర్ న్యాయవాది ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. భూ వివాదాలే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి (58) భూ సమస్యలకు సంబంధించి నిన్న ములుగులోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. పని చూసుకుని సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తిరిగి హనుమకొండకు బయలుదేరారు. ములుగు మండలంలోని పందికుంట బస్ స్టేజీ సమీపంలో స్పీడ్‌బ్రేకర్లు ఉండడంతో మల్లారెడ్డి తన వాహనాన్ని స్లో చేశారు.

అదే సమయంలో వెనక నుంచి కారులో ఆయనను అనుసరిస్తూ వస్తున్న నిందితులు న్యాయవాది కారును ఢీకొట్టారు. దీంతో వాహనం ఆపి కిందికి దిగిన మల్లారెడ్డి కారును ఢీకొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిందితుల్లో ఓ వ్యక్తి వచ్చి కావాలని ఢీకొట్టలేదని, క్షమించాలని కోరడంతో మల్లారెడ్డి శాంతించి తిరిగి కారులో కూర్చున్నారు. ఆయన డోరు వేసుకుంటున్న సమయంలో వచ్చిన మరికొందరు వ్యక్తులు మల్లారెడ్డిని కిందికి లాగి సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. 

ఇద్దరు వ్యక్తులు కారు డ్రైవర్‌ను కదలకుండా పట్టుకున్నారు. మల్లారెడ్డి చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న ములుగు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

 మల్లారెడ్డికి ములుగు మండలంలోని మల్లంపల్లిలో వ్యవసాయ భూములతోపాటు ఎర్రమట్టి క్వారీ, పెట్రోలు బంకు వ్యాపారాలున్నాయి. భూములకు సంబంధించిన కేసులు కోర్టుల్లో ఉన్నాయి. మల్లారెడ్డి హత్యకు ఈ భూ సమస్యలే కారణమని అనుమానిస్తున్నారు. ఆయన కదలికలను పసిగట్టి పక్కా ప్రణాళికతోనే నిందితులు ఆయనను హత్య చేశారని చెబుతున్నారు. కాగా, మల్లారెడ్డి స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి గత కొంతకాలంగా హనుమకొండలో ఉంటున్నారు.

Mulugu
Hanamkonda
Warangal
Lawyer
Murder
Telangana
  • Loading...

More Telugu News