Iran: మేం అణుబాంబు తయారు చేయగలం.. ఇప్పుడా ఉద్దేశం లేదు: ఇరాన్
- ప్రస్తుతానికైతే తమ ఎజెండాలో ఈ అంశం లేదన్న ఇరాన్ అణుశక్తి సంస్థ చీఫ్
- అణుశక్తి విషయంపై త్వరలో పలు దేశాలతో చర్చలు జరపనున్నట్టు వెల్లడి
- 60 శాతం స్వచ్ఛతతో యురేనియంను శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగిన ఇరాన్
ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేయగలదని ఆ దేశ అణు శక్తి సంస్థ చీఫ్ మహమ్మద్ ఇస్లామీ ప్రకటించారు. గతంలో ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖొమైనీకి ప్రధాన సలహాదారు అయిన కమాల్ ఖరాజి చేసిన వ్యాఖ్యలను మహమ్మద్ ఇస్లామీ సమర్థించారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ఇంతకుముందు ఖరాజీ చెప్పినట్టుగా.. ఇరాన్ కు సాంకేతికంగా అణు బాంబులను తయారు చేసే సామర్థ్యం ఇప్పటికే ఉంది. కావాలనుకుంటే అణ్వస్త్రాలను తయారు చేయగలం. అయితే ప్రస్తుతానికి అణు బాంబు తయారు చేయాలన్న అంశం మా ఎజెండాలో లేదు..” అని మహమ్మద్ ఇస్లామీ వెల్లడించారు.
ఇప్పటికే అణు శుద్ధి సామర్థ్యం
ఇరాన్ అణు శుద్ధి ప్రయత్నాలను విరమించుకోవాలని చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలు ఒత్తిళ్లు చేస్తున్నాయి. ఈ మేరకు 2015లోనే అమెరికా సహా అగ్ర రాజ్యాలు ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరాన్ 3.67 శాతానికి మించి యురేనియంను శుద్ధి చేయకూడదని నిబంధన పెట్టాయి. అయినా ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగించడంతో.. 2018లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు.
ప్రస్తుతం ఇరాన్ 60 శాతం స్వచ్ఛతతో యురేనియంను శుద్ధి చేసే సామర్థ్యాన్ని సాధించిందని అంచనా. 90శాతం వరకు స్వచ్ఛతను సాధిస్తే.. అణు బాంబులను తయారు చేయడానికి వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే తాజాగా ఇరాన్ నేతల ప్రకటనలు చూస్తుంటే ఇరాన్ అణు శుద్ధిలో మరింత ముందుకు వెళ్లినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.