CPI Narayana: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు లేఖ రాసిన సీపీఐ నారాయణ
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నారాయణ సంఘీభావం
- విద్యార్థులపై అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని వెల్లడి
- హాస్టల్ నిర్వహణ వర్సిటీ చేతుల్లోనే ఉండాలని స్పష్టీకరణ
- విద్యార్థుల డిమాండ్ కు మద్దతు
సీపీఐ అగ్రనేత నారాయణ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు లేఖ రాశారు. బాసర ట్రిపుట్ ఐటీ విద్యార్థులపై అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ నారాయణ తన లేఖలో ఆరోపించారు. విద్యార్థులకు నాసిరకం ఆహారం అందిస్తున్నారని తెలిపారు. హాస్టల్ నిర్వహణ వర్సిటీ చేతుల్లోనే ఉండాలని విద్యార్థులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ట్రిపుల్ ఐటీకి వెంటనే పూర్తిస్థాయి వీసీని నియమించాలని కోరారు.
కాగా, ఈ నెల 15న బాసర ట్రిపుల్ ఐటీ మెస్ లో ఫుడ్ పాయిజనింగ్ జరిగిందన్న కారణంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోవడంతో తాజాగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెస్ వద్ద అల్లర్లకు పాల్పడుతూ, చదువుకునే విద్యార్థులను అడ్డుకుంటే షోకాజ్ నోలీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. అప్పటికీ విద్యార్థుల తీరులో మార్పు రాకపోతే వారిని బర్తరఫ్ చేస్తామని హెచ్చరించారు.