Indian Railway: మీ రైల్వే టికెట్ వేరే వారి పేరు మీదకు బదిలీ చేయొచ్చు..
- కుటుంబ సభ్యుల్లో వేరొకరికి బదిలీ చేయవచ్చు
- ప్రయాణానికి 24 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి
- ప్రింటెడ్ కాపీతో రైల్వే రిజర్వేషన్ కేంద్రాన్ని సంప్రదించాలి
రైల్వే రిజర్వేషన్ చేసుకున్నారు. ప్రయాణ సమయం దగ్గర పడుతోంది. ఇంతలో ప్రయాణం అవసరం లేదనిపించొచ్చు. లేదంటే వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. ఇటువంటి సందర్భాల్లో టికెట్ రద్ధు చేసుకోవడం గురించే ఎక్కువ మందికి తెలుసు. కానీ, టికెట్ రద్ధు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే.. మీ టికెట్ పేరుతో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రయాణించొచ్చని తెలుసా..? ఎప్పటి నుంచో ఈ సదుపాయం అందుబాటులో ఉన్నా కానీ, దీని గురించి పెద్దగా అవగాహన లేదు.
ఐఆర్ సీటీసీ, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా కన్ఫర్మ్ డ్ టికెట్ తీసుకున్న వారు, తమ బదులు వేరొకరికి దాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రయాణానికి కనీసం 24 గంటల ముందు టికెట్ ప్రింటెడ్ కాపీతో రైల్వే రిజర్వేషన్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో కోరిన వారి పేరు మీదకు ఆ టికెట్ ను రైల్వే సిబ్బంది బదిలీ చేసి ఇస్తారు.
ఇలా రిజర్వేషన్ టికెట్ ను ఒకసారి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు మార్చే అవకాశం లభిస్తుంది. అదే టికెట్ ను రెండోసారి మార్చడం కుదరదు. ప్రింటెడ్ టికెట్ కాపీ, ఆధార్ లేదా ఓటర్ ఐడీ కార్డుతో రిజర్వేషన్ కేంద్రాన్ని సంప్రదించి మార్చుకోవచ్చు. ఇక్కడ టికెట్ రిజర్వేషన్ ప్రస్తుతం ఎవరి పేరు మీద ఉంటే వారు, ఎవరి పేరు మీదకు మారుస్తున్నారో వారి ఆధార్ కార్డు జిరాక్స్ కూడా తీసుకెళ్లాలి. కుటుంబ సభ్యులు కాకుండా ఇతరుల పేరు మీదకు మార్చే అవకాశం ఉందా? అన్న దానిపై స్పష్టత లేదు. కనుక రిజర్వేషన్ కేంద్రానికి వెళ్లి విచారించుకోవాలి.