Pedro Sanchez: ఇంధన పొదుపుకు స్పెయిన్ ప్రధాని ఆసక్తికర ప్రతిపాదన
- యూరప్ దేశాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు
- గత సీజన్లకు భిన్నంగా వేడి వాతావరణం
- ఉక్కపోతతో అల్లాడుతున్న యూరప్ దేశాల ప్రజలు
- టైలు కట్టుకోవద్దంటున్న స్పెయిన్ ప్రధాని
సాధారణంగా యూరప్ దేశాలు శీతల వాతావరణం కలిగివుంటాయి. ఆ ఉద్దేశంతోనే ఉష్ణ దేశాల ప్రజలు యూరప్ దేశాలకు విహార యాత్రలకు వెళుతుంటారు. కానీ ఈ సీజన్ లో యూరప్ ఎండలతో మండిపోతోంది. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికస్థాయిలో నమోదవుతున్నాయి. గతంలో ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడూ చూడకపోవడంతో ఆయా దేశాల ప్రజల బాధలు వర్ణనాతీతం. ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఈ నేపథ్యంలో, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. క్యాబినెట్ మంత్రులు, పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు టైలు కట్టుకోవడం మానేయాలని సూచించారు. టైలు కట్టుకోవడం వల్ల ఉక్కపోత మరింత ఎక్కువగా అనిపిస్తుందని, అందుకే తాను టై కట్టుకోవడం మానేశానని వెల్లడించారు. తద్వారా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ ల వినియోగం తగ్గి, ఇంధనం ఆదా అవుతుందని సూత్రీకరించారు. పరిస్థితిని అర్థం చేసుకుని తాత్కాలికంగా టైలు ధరించరాదని పెడ్రో శాంచెజ్ పిలుపునిచ్చారు.