Chetan Singh: ఆప్ మంత్రి ఆదేశాలకు భయపడి... పాడైపోయిన బెడ్ పై పడుకున్న బాబా ఫరీద్ వర్సిటీ వీసీ

VC lays down on a condemned bed after AAP minster orders

  • ఫరీద్ కోట్ లో ఆప్ మంత్రి చేతన్ సింగ్ పర్యటన
  • బాబా ఫరీద్ వర్సిటీలో తనిఖీలు
  • బెడ్లు పాడైపోయి ఉండడం గుర్తించిన మంత్రి
  • వీసీకి చీవాట్లు పెట్టిన మంత్రి 

పంజాబ్ లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రాజ్ బహదూర్ కు గతంలో ఎప్పుడూ ఎదురుకాని విపత్కర పరిస్థితి ఆప్ మంత్రి చేతన్ సింగ్ జౌరామజ్రా రూపంలో ఎదురైంది. చేతన్ సింగ్ జౌరామజ్రా పంజాబ్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఫరీద్ కోట్ లోని బాబా ఫరీద్ యూనివర్సిటీలోని వైద్య కళాశాలలో తనిఖీలు చేసేందుకు వచ్చారు. 

అయితే, అక్కడి ఆసుపత్రిలోని బెడ్లు పూర్తిగా పాడైపోయి ఉండడాన్ని గమనించి వర్సిటీ వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బెడ్లపై ఎలా పడుకుంటారు? అంటూ వైస్ చాన్సలర్ డాక్టర్ రాజ్ బహదూర్ ను చీవాట్లు పెట్టారు. మీరు ఇలాంటి బెడ్ పై పడుకోగలరా? ఓసారి పడుకోండి మేం చూస్తాం అంటూ ఆదేశించారు. 

అప్పటికే మంత్రి ఆగ్రహంతో బిక్కచచ్చిపోయిన ఆ వీసీ మరింత భయపడిపోయి వెంటనే బెడ్ పై పడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే, మంత్రి తీరుపట్ల విమర్శలు వస్తున్నాయి. ఆప్ ప్రభుత్వం చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతోందని, వైద్య సిబ్బంది మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని విపక్షాలు మండిపడ్డాయి.

Chetan Singh
Raj Bahadur
Bed
Baba Farid University
AAP
Punjab

More Telugu News