Maharashtra: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే 36 రైళ్ల రద్దు!
- బిగ్వాన్-వాషింబే స్టేషన్ల మధ్య కొనసాగుతున్న డబుల్ లైన్ పనులు
- ఆగస్టు 4 నుంచి 11వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు
- మరో 8 రైళ్ల దారి మళ్లింపు
- మరికొన్ని రైళ్ల గమ్యస్థానాల కుదింపు
మహారాష్ట్రలోని బిగ్వాన్-వాషింబే స్టేషన్ల మధ్య జరుగుతున్న డబుల్ లైన్ పనుల కారణంగా, ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే 36 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 8 రైళ్లను దారి మళ్లించారు. ఆరు రైళ్ల గమ్యస్థానాలను కుదించింది.
హైదరాబాద్-సీఎస్‌టీ ముంబై ఎక్స్‌ప్రెస్ (17032) ను ఆగస్టు 4-8 మధ్య రద్దు చేయగా, తిరుగు ప్రయాణంలో అదే రైలు (17031)ను ఆగస్టు 5-9 మధ్య రద్దు చేశారు. సికింద్రాబాద్-రాజ్‌కోట్ (22718) మధ్య ప్రయాణించే రైలును ఆగస్టు 6,8,9 తేదీల్లో రద్దు చేయగా, అటునుంచి వచ్చే రైలు (22717)ను 8,10, 11 తేదీల్లో రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాకినాడ పోర్టు-ఎల్‌టీటీ ముంబై (17221), ఎల్‌టీటీ ముంబై-కాకినాడ పోర్టు (17222) రైళ్లను ఆగస్టు 4, 7 తేదీల్లో రద్దు చేశారు.
ఇండోర్-లింగంపల్లి (20916) రైలును ఆగస్టు 6న, లింగంపల్లి నుంచి ఇండోర్ వెళ్లే రైలు (20915)ను 7న రద్దు చేశారు. పోర్‌బందర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు (19202)ను ఆగస్టు 9న, సికింద్రాబాద్-పోర్‌బందర్ రైలు (19201) ను ఆగస్టు 10న రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి హదాప్సర్ వెళ్లాల్సిన రైలు (17014)ను ఆగస్టు 4,6,8 తేదీల్లో కుర్దావాడి స్టేషన్‌కు కుదించారు. అదే రైలు తిరుగు ప్రయాణంలో ఆగస్టు 5,7,9 తేదీల్లో కుర్దావాడి స్టేషన్ నుంచి బయలుదేరుతుందని పేర్కొన్న అధికారులు.. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.