Gutha Sukender Reddy: రాజీనామా చేస్తే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం: గుత్తా హెచ్చరిక

Gutha Sukender Reddy warns komatireddy raj gopal reddy

  • హుజూరాబాద్ పరిస్థితి వేరు.. మునుగోడు వేరన్న గుత్తా
  • మునుగోడుకు ఉప ఎన్నిక జరిగితే గెలుపు టీఆర్ఎస్‌దేనని ధీమా
  • మునుగోడుకు రాజగోపాల్ ఏం చేశారని ప్రశ్న
  • షర్మిలకు రాజన్న రాజ్యం కావాలంటే ఏపీకి వెళ్లాలని సూచన

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారన్న ఊహాగానాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పందించారు. రాజగోపాల్‌రెడ్డి కనుక కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరితే ఆయన మునిగిపోక తప్పదని హెచ్చరించారు. హుజూరాబాద్ పరిస్థితులు వేరు, మునుగోడు పరిస్థితులు వేరని అన్నారు. 

అసలు నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదన్న గుత్తా.. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరినా ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయరని, కాబట్టి మునుగోడుకు ఉప ఎన్నిక రాదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే జరిగి ఉప ఎన్నిక అనివార్యమైతే మాత్రం ఆ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నూటికి నూరుశాతం విజయం సాధిస్తుందని గుత్తా ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాలను పెంచిన కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పెంచదని ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్థిక సమస్యలకు కేంద్రం నిర్వాకమే కారణమని విమర్శించారు. 

పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించడం ద్వారా ముంపు సమస్యను నివారించవచ్చన్నారు. అలా కుదరని పక్షంలో ఏడు మండలాలను, లేదంటే భద్రచలాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని గుత్తా డిమాండ్ చేశారు. వైఎస్ షర్మిలపైనా గుత్తా విరుచుకుపడ్డారు. ఆమెకు రాజన్న రాజ్యం కావాలంటే ఏపీకి వెళ్లాలని సూచించారు.

More Telugu News