Sriram Venkitraman: జిల్లా కలెక్టర్‌గా భార్య చేతుల నుంచి బాధ్యతలు స్వీకరించిన భర్త!

Sriram Venkitraman Takes Over as Alappuzha Collector From Wife Renu Raj

  • భార్య స్థానంలో భర్తను కలెక్టర్‌గా నియమించిన ప్రభుత్వం
  • భర్తకు బాధ్యతలు అప్పగించిన భార్య
  • వెంకట్రామన్ నియామకాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన
  • హత్య కేసులో నిందితుడైన వ్యక్తిని కలెక్టర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్న

కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్‌గా ఉన్న రేణురాజ్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో శ్రీరామ్ వెంకట్రామన్‌ను నియమించింది. బదిలీ అయిన రేణురాజ్‌కు శ్రీరామ్ భర్త కావడమే ఇందులో విశేషం. 

భర్తకు జిల్లా బాధ్యతలను అప్పగించిన రేణురాజ్.. వీడ్కోలు తీసుకున్నారు. రేణు-శ్రీరామ్ ఇద్దరూ తొలుత వైద్యులు. ఆ తర్వాత ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కేరళ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీరామ్‌కు ప్రభుత్వం తాజాగా అలప్పుళ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. అక్కడి కలెక్టర్ అయిన శ్రీరామ్ భార్య రేణురాజ్‌ను ఎర్నాకుళం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది.

కాగా, శ్రీరామ్ వెంకట్రామన్‌ను అలప్పుళ కలెక్టర్‌గా నియమించడంపై కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆయన నియామకపు ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన వెనక ఓ కారణం ఉంది. వెంకట్రామన్ 2019లో స్నేహితురాలు వఫా ఫిరోజ్‌తో కలిసి వేగంగా కారు నడుపుతూ బైక్‌పై వెళ్తున్న జర్నలిస్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో జర్నలిస్టు మృతి చెందారు. 

ఈ కేసులో వెంకట్రామన్ ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. 2020లో తిరిగి బాధ్యతలు చేపట్టిన వెంకట్రామన్‌ను ఇప్పుడు అలప్పుళ కలెక్టర్‌గా నియమించడంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. హత్య కేసులో నిందితుడైన వ్యక్తి ప్రజలకు న్యాయం చేయలేరని, ఆయనను కలెక్టర్‌గా నియమించడం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News