Ambati Rambabu: ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రిని కలిసిన అంబటి రాంబాబు
![ap minister ambati rambabu met union minister gajendra singh shekhawat in delhi](https://imgd.ap7am.com/thumbnail/cr-20220727tn62e11408722f3.jpg)
- వరదల నేపథ్యంలో పోలవరంపై రేగిన వివాదం
- అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
- ఎంపీలు పెద్దిరెడ్డి, పిల్లి, లావులతో కలిసి కేంద్ర మంత్రి వద్దకు అంబటి
- పోలవరం కేంద్రంగానే కీలక చర్చ జరిగినట్టు సమాచారం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఉప్పొంగిన గోదావరి నది, నీట మునిగిన పోలవరం నిర్వాసిత ప్రాంతాలు, పోలవరం ప్రాజెక్టుపై రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు చెలరేగుతున్న వేళ... బుధవారం ఢిల్లీ వెళ్లిన ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. పార్టీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, లావు శ్రీకృష్ణ దేవరాయలు తదితరులతో కేంద్ర మంత్రి వద్దకు వెళ్లిన అంబటి... ఆయనతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా గజేంద్ర సింగ్ షెకావత్‌తో రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించిన అంబటి రాంబాబు... ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు గురించే మాట్లాడినట్లు సమాచారం. పోలవరం నిర్వాసితులకు అందాల్సిన పరిహారం, పునరావాసం, ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం, కాఫర్ డ్యాంపై నెలకొన్న వివాదం, పోలవరం ఎత్తు పెంపు, దానిపై తెలంగాణ అభ్యంతరాలు, విలీన మండలాల్లోని గ్రామాలను తమకివ్వాలంటూ తెలంగాణ చేస్తున్న డిమాండ్లు... ఇలా చాలా అంశాలపైనే ఆయన కేంద్ర మంత్రితో చర్చించినట్లుగా తెలుస్తోంది.