YSRCP: జీవనోపాధి చూపాలన్న మహిళకు అక్కడికక్కడే వలంటీర్ నియామక ఉత్తర్వు అందించిన జగన్
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్
- పెదపూడి లంకలో జీవనోపాధి చూపాలన్న జ్యోతి
- గ్రామ వలంటీర్‌గా జ్యోతిని నియమించాలని జగన్ ఆదేశం
- అక్కడికక్కడే ఉత్తర్వులు సిద్ధం చేసిన అధికారులు
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్సాహంగా కనిపించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలను వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మంగళవారం వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లిన జగన్... తొలుత అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు మండలాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా పి.గన్నవరం మండలం పెదపూడిలంకలో జగన్ పర్యటిస్తుండగా...ఆయన వద్దకు జ్యోతి అనే మహిళ వచ్చింది. తన భర్త అనారోగ్యంతో మంచానపడ్డాడని, జీవనోపాధి చూపాలంటూ ఆమె జగన్‌ను వేడుకుంది. దీంతో అక్కడికక్కడే స్పందించిన జగన్.. జ్యోతిని గ్రామ వలంటీర్‌గా నియమించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో వేగంగా స్పందించిన అధికార యంత్రాంగం జ్యోతిని వలంటీర్‌గా నియమిస్తూ అక్కడికక్కడే ఉత్తర్వులను తయారు చేసింది. ఈ ఉత్తర్వులను జ్యోతికి జగన్ అందజేశారు. ఈ మొత్తం వ్యవహారం నిమిషాల వ్యవధిలోనే పూర్తి కావడం గమనార్హం.