Honor: భారత్ నుంచి వెళ్లిపోవడం లేదు: 'ఆనర్' సంస్థ వివరణ
- తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతాయంటూ ప్రకటన
- భారత్ నుంచి వెళ్లిపోతున్నామన్నది నిజం కాదని స్పష్టీకరణ
- కొన్ని కారణాల వల్లే టీమ్ ను తొలగించినట్టు వివరణ
భారత్ మార్కెట్ నుంచి తాము వెళ్లిపోవడం లేదని చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ 'ఆనర్' స్పష్టం చేసింది. ఆనర్ ట్విట్టర్ ఖాతా ఏడాదిగా నిస్తేజంగా ఉందని, దీనికి కారణం కంపెనీ భారత మార్కెట్ నుంచి వెళ్లిపోనుందంటూ వార్తలు వచ్చాయి. ఈ వదంతులను సంస్థ ఖండించింది. ఆనర్ ఇటీవలే వాచ్ జీఎస్3 పేరుతో స్మార్ట్ వాచ్ ను రూ.12,990 ధరపై విడుదల చేయడం తెలిసిందే.
‘‘ఆనర్ భారత్ లో తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తూనే ఉంది. మా అభివృద్ధి కార్యకలాపాలు ఇక ముందూ కొనసాగుతాయి. భారత మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ఆనర్ ప్రకటించిందన్న వార్త నిజం కాదు’’ అని సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
హువావే సబ్ బ్రాండ్ గా ఉన్న ఆనర్ లోగడ తన భారత టీమ్ ను తొలగించింది. దీనిపై సంస్థ సీఈవో జావోమింగ్ స్పందిస్తూ కొన్ని కారణాల వల్లే అలా చేయాల్సి వచ్చిందన్నారు. కంపెనీ తన కార్యకలాపాలు కొనసాగిస్తుందన్నారు. స్థానిక భాగస్వాములే దీన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు.