Congress: రేపు ఈడీ విచారణకు సోనియా గాంధీ... నిరసనల వ్యూహంపై పార్టీ కీలక భేటీ
- నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు సోనియా
- ఇప్పటికే ఓ పర్యాయం విచారణకు హాజరైన వైనం
- మంగళవారం మరోమారు ఈడీ ముందుకు కాంగ్రెస్ అధినేత్రి
- శాంతియుత నిరసనలకు కాంగ్రెస్ నిర్ణయం
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రేపు (మంగళవారం) మరోమారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఓ రోజు ఈడీ విచారణకు సోనియా హాజరైన సంగతి తెలిసిందే. ఈ నెల 21న తమ ముందు హాజరైన సోనియాను 3 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు...తిరిగి ఈ నెల 26న మరోమారు విచారణకు రావాలని నాడే సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
మంగళవారం మరోమారు ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరు కానున్న నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఓ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ భేటీకి పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల శాఖలు, విభాగాల ఇంచార్జీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ భేటికి నేతృత్వం వహించిన పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే... అహింసా పద్ధతుల్లోనే బీజేపీ సర్కారుకు నిరసన తెలియజేయాలని సూచించారు.