Polar Bear: పాలు తాగబోతే.. రేకు డబ్బాలో నాలుక ఇరుక్కుని.. ఎలుగుబంటి నరక యాతన!
- రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఇబ్బంది పడ్డ ధ్రువపు ఎలుగుబంటి
- ఆహారం తినలేక, నీళ్లు తాగలేక శుష్కించిపోయిన తీరు
- స్థానికుల సమాచారంతో మాస్కో జూ సిబ్బంది చర్యలు
- నాలుకకు గుచ్చుకున్న టిన్ ను తొలగించి చికిత్స
అది ఉత్తర రష్యాలోని సైబీరియాలో ఉన్న డిక్సన్ ప్రాంతం.. సుమారు రెండేళ్ల వయసున్న ఆడ ధ్రువపు ఎలుగుబంటి సంచరిస్తోంది.. సరిగా ఆహారం దొరక్క మనుషులు ఉండే ప్రాంతంలో తిరుగాడటం మొదలుపెట్టింది. ఓ ఇంటి బయట పడేసి ఉన్న పాల టిన్ (రేకు డబ్బా)లో మిగిలిఉన్న పాలు జుర్రుకునేందుకు నాలుకతో ప్రయత్నించింది. కానీ ఆ రేకు డబ్బాపై తెరిచి ఉన్న ఇనుప ముక్క నాలుకకు గుచ్చుకుంది. ఎలుగుబంటి నాలుక ఆ రేకు డబ్బాలో చిక్కుకుపోయింది. రేకు గుచ్చుకుపోయిన నొప్పి ఓ వైపు.. ఏమీ తినలేక, నీళ్లు కూడా తాగలేక మరోవైపు ఆ ఎలుగుబంటి నరక యాతన అనుభవించింది. తన మంచు ప్రాంతంలోకి వెళ్లిపోయినా.. ఏమనుకుందో ఏమోగానీ మళ్లీ మనుషులు ఉండే ప్రాంతానికి వచ్చి తిరుగాడటం మొదలుపెట్టింది.
మత్తు మందు ఇచ్చి..
ఆ ఎలుగుబంటిని గమనించిన కొందరు స్థానికులు దీనిపై ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న మాస్కో జూకు చెందిన జంతు వైద్య నిపుణుల బృందం.. డిక్సన్ ప్రాంతానికి చేరుకుంది. ఇంజక్షన్ తుపాకీ సాయంతో ఎలుగు బంటికి మత్తు మందు ఇచ్చింది. దాని నాలుక చిక్కుకున్న రేకు డబ్బాను తొలగించింది. నాలుకకు అయిన గాయాలకు కుట్లు వేసి.. మందులు వేసింది. ‘‘ఆహారం తినలేకపోవడం వల్ల ఎలుగుబంటి బాగా బలహీనంగా మారిపోయింది. డీహైడ్రేషన్ తోనూ బాధపడుతున్నట్టు గుర్తించాం. అది రికవరీ కావడానికి మందులు ఇచ్చాం. త్వరలోనే కోలుకుని మునుపటిలా మారుతుందని ఆశిస్తున్నాం” అని మాస్కో జూ జంతు వైద్య నిపుణుడు మిఖాయిల్ అల్షినెట్స్కీ తెలిపారు.
గ్లోబల్ వార్మింగ్ ఓవైపు.. మనుషుల తీరు మరోవైపు..
ఇంతకుముందు కెనడాలోనూ ఓ ఎలుగుబంటి ఇలా నాలుకకు ప్లాస్టిక్ వస్తువు చిక్కుకుని దారుణమైన పరిస్థితికి చేరిన ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు రష్యాలో అదే పరిస్థితి ఎదురైంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు ప్రాంతాల్లో ధ్రువపు ఎలుగుబంట్లు జీవించే పరిస్థితులు మారిపోతున్నాయి. వాటికి సరిగా ఆహారం దొరికే పరిస్థితి ఉండటం లేదని, అందుకే మనుషులు ఉండే వైపు వస్తున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- మనుషులు ఇళ్లలో మిగిలిన ఆహారాన్ని, చెత్తా చెదారాన్ని ఆరు బయటే ఉంచుతుండటంతో వాటి వద్దకు ఎలుగుబంట్లు వస్తున్నాయని.. ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నాయని పేర్కొంటున్నారు.
- ప్లాస్టిక్, ఇనుప వస్తువులు, చెత్త వల్ల అటు కాలుష్యంతోపాటు ఇటు జంతువులకు ప్రమాదకరంగా మారుతోందని వాపోతున్నారు.