YS Sharmila: సిగ్గు లేకుండా ఒక స్త్రీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు: కేటీఆర్ పై మండిపడ్డ షర్మిల

KTR making personal comments on me says  YS Sharmila

  • ఓటీటీలో సినిమాలు సూచించమంటే సెటైరికల్ గా సమాధానం ఇచ్చానన్న షర్మిల 
  • దీంతో తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేశారని వ్యాఖ్య 
  • వరదలతో ప్రజలు అల్లాడుతుంటే ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారా? అని నిలదీత 
  • వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టే కారణమన్న షర్మిల 
  • 33 మంది సిబ్బంది ఉండాల్సిన కడెం ప్రాజెక్టు వద్ద ముగ్గురు మాత్రమే ఉన్నారని విమర్శ 

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విరుచుకుపడ్డారు. కాలుకు దెబ్బ తగలడంతో కేటీఆర్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాలక్షేపం కోసం తనకు ఓటీటీలో మంచి సినిమాలు, కార్యక్రమాలను సూచించాలని ఆయన అడిగారు. ఈ నేపథ్యంలో ఆయనకు షర్మిల సెటైరికల్ గా రీట్వీట్ చేశారు. 'మీ ఆనందం కోసం చూడటానికి షోలు: కుట్ర సిద్ధాంతం - క్లౌడ్ బరస్ట్ - నీట మునిగిన గృహాలు మరియు పంప్ హౌస్ లు' అంటూ సమాధానం ఇచ్చారు. 

తాజాగా ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై మండిపడ్డారు. రెస్ట్ లో ఉన్నానంటూ... ఓటీటీలో సినిమాల కోసం సలహా అడిగితే తాము వెటకారంగా స్పందించామని... దీంతో చిన్న దొరగారికి మాపై చాలా కోపం వచ్చిందని... తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేశారని మండిపడ్డారు. 

దమ్ముంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడాలని షర్మిల అన్నారు. ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారా? రిమోట్ గా పని చేయడం చేతకాదా? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో అందరం రిమోట్ గా పని చేయలేదా? అని అడిగారు. వరదలతో ప్రజలు అల్లాడుతుంటే ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారా? అని ప్రశ్నించారు. 

వరద బాధితులకు ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా సినిమాలు చూస్తారంట అని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. సిగ్గు లేకుండా ఒక స్త్రీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలతో తనకు మండిందని చెప్పారు. 

ఈ వరదలకు ప్లానింగ్ లేకుండా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని షర్మిల విమర్శించారు. కేవలం కలర్ ఫొటోలు తీసుకోవడానికి, టూరిజం స్పాట్ గా మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పనికొస్తుందని అన్నారు. కాళేశ్వరం లోపాల బాధ్యతను ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. కడెం ప్రాజెక్టు గేట్లు పనిచేయకపోవడం వల్ల పెద్ద వరద వచ్చిందని చెప్పారు. కడెం ప్రాజెక్టు వద్ద 33 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా... కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని అన్నారు. కడెం ప్రాజెక్టు గేట్లు మార్చాలని కేసీఆర్ కు చెప్పినా ఆయన పట్టించుకోలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News