Droupadi Murmu: నూతన రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము
- ప్రమాణం చేయించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
- పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన కార్యక్రమం
- ముర్మును తోడ్కొని వచ్చిన ఉప రాష్ట్రపతి, స్పీకర్
భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. దీంతో భారత్ కు ఆమె 15వ రాష్ట్రపతి అయ్యారు. అలాగే ఈ పదవిని చేపట్టిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము రికార్డుల్లోకి చేరారు. మరోపక్క, అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. అంతేకాదు, రాష్ట్రపతి పదవిని అలంకరించిన అతి పిన్న వయసు వ్యక్తి కూడా ఆమె కావడం గమనార్హం.
పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ద్రౌపది ముర్మును పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి తొడ్కొని వచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై గెలవడం తెలిసిందే. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆమె గతంలో ఆ రాష్ట్ర మంత్రిగా రెండేళ్లపాటు పనిచేశారు. ఝార్ఖండ్ గవర్నర్ గానూ సేవలందించారు.