Kuppam: కుప్పంలో రెండుసార్లు పోటీపడిన వైసీపీ నేత చంద్రమౌళి జయంతి నేడు.. కుమారుడి నివాళి వీడియో ఇదిగో
- 2014, 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసిన చంద్రమౌళి
- 2019 ఎన్నికల ఫలితాలు రాకుండానే మృతి చెందిన వైనం
- చంద్రమౌళి కుమారుడు భరత్‌కు ఎమ్మెల్సి ఇచ్చిన జగన్
- 2024 ఎన్నికల్లో చంద్రబాబుపై భరత్‌నే పోటి చేయించనున్న వైసీపీ
చిత్తూరు జిల్లా పరిధిలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి అక్కడ టీడీపీ తప్పించి వేరే పార్టీ గెలిచిన దాఖలానే లేదు. టీడీపీ ప్రస్థానం మొదలైనప్పుడు ఆ పార్టీ అభ్యర్థి రంగస్వామినాయుడు కుప్పంలో విజయం సాధించారు. ఆ తర్వాత మరోసారి ఆయన గెలవగా... 1989 నుంచి వరుసబెట్టి 7 సార్లు చంద్రబాబు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అలాంటి కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీ గడచిన రెండు ఎన్నికల్లో గట్టి ప్రయత్నమే చేసింది. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన కె.చంద్రమౌళిని బరిలోకి దించిన వైసీపీ 2019 ఎన్నికల్లో గట్టిగా కృషి చేసింది.
అయితే అనారోగ్య కారణాలతో ఎన్నికలకు కాస్తంత ముందుగా ఆసుపత్రిలో చేరిన చంద్రమౌళి తిరిగి బయటకు రాలేదు. అయితే అప్పటికే వైసీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేయడంతో చంద్రమౌళి ఆసుపత్రిలోనే ఉన్నా ఆయన కుటుంబం ఆయన తరఫున ప్రచారం చేసింది. 2019 ఏప్రిల్ 11న పోలింగ్ జరగగా... అదే నెల 17న చంద్రమౌళి ఆసుపత్రిలోనే కన్నుమూశారు. అంటే ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఆయన మృతి చెందారు. చంద్రమౌళి మరణం తర్వాత మే 23న ఓట్ల లెక్కింపు జరగగా... చంద్రబాబు చేతిలో చంద్రమౌళి ఓడిపోయారు.
అయితే 2014లోనూ చంద్రబాబుపై పోటీ చేసిన చంద్రమౌళి... అప్పుడు 55 వేల ఓట్లు తెచ్చుకోగా... 2019లో మాత్రం ఏకంగా 70 వేలకు తన ఓట్లను పెంచుకున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు పోలైన ఓట్లలో మాత్రం పెద్దగా తేడా కనిపించలేదు. 2014 కంటే 2019లో చంద్రబాబుకు కేవలం 2,800 ఓట్లు మాత్రం తగ్గాయి. చంద్రబాబు మెజారిటీ మాత్రం 47 వేల నుంచి 30 వేలకు పడిపోవడం గమనార్హం.
ఇలా చంద్రబాబుపై వరుసగా రెండు పర్యాయాలు కుప్పం నుంచి పోటీ చేసిన చంద్రమౌళి రాజకీయంగా పెద్దగా రాణించకపోయినా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. చంద్రమౌళి సేవలకు గుర్తింపుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన కుమారుడు కేఆర్‌జే భరత్‌ను ఎమ్మెల్సీని చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై భరత్‌నే పోటీకి దింపేలా వ్యూహం రచిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం చంద్రమౌళి జయంతిని స్మరించుకుంటూ ఆయన కుమారుడు, వైసీపీ ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.