Congress: సోనియాకు మద్దతుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు.. 56 మంది ఎంపీల అరెస్ట్
- నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరైన సోనియా
- రెండు గంటలపాటు విచారించిన ఈడీ అధికారులు
- దేశవ్యాప్తంగా నిరసన తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు
- ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని ఈడీ నిన్న ప్రశ్నించింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ విచారణలో 25కు పైగా ప్రశ్నలు సంధించింది. అనంతరం ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మరోమారు సమన్లు జారీ చేసింది. మరోవైపు, సోనియాను విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు. బెంగళూరులో ఓ కారును తగలబెట్టారు. ఢిల్లీలో నిరసన తెలిపిన మొత్తం 349 కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 56 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న వారిలో పార్టీ సీనియర్ నేతలు పి.చిదంబరం, అజయ్ మాకెన్, అధీర్ రంజన్, మాణికం ఠాగూర్, కె.సురేష్, శశిథరూర్ వంటి నేతలు ఉన్నారు.