President Of India: భారీ ఆధిక్యం దిశగా ద్రౌపది ముర్ము... రెండో రౌండ్‌లోనూ ఎన్డీఏ అభ్యర్థికి ఆధిక్యం
- ముగిసిన రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు
- ముర్ముకు 1,349 ఓట్లు వచ్చిన వైనం
- యశ్వంత్ సిన్హా ఖాతాలో 537 ఓట్లు మాత్రమే
- రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్న ఓట్ల లెక్కింపు
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తుది అంకమైన ఓట్ల లెక్కింపు ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో గురువారం ఉదయం మొదలైన సంగతి తెలిసిందే. మధ్యాహ్నానికే తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా... సాయంత్రం 5.30 గంటల సమయంలో రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. తొలి రౌండ్‌లో ఎంపీల ఓట్లను లెక్కించిన అధికారులు... ఆ తర్వాతి రౌండ్లలో ఎమ్మెల్యేల ఓట్లను లెక్కిస్తున్నారు.
ఎంపీల ఓట్లలో ముర్ముకు 540 ఓట్లు రాగా, వాటి విలువ 3,78,000గా తేలిన సంగతి తెలిసిందే. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తొలి రౌండ్‌లో కేవలం 208 ఓట్లు మాత్రమే రాగా.. వాటి విలువ 1,45,600గా తేలింది. తాజాగా రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి ముర్ముకు 1,349 ఓట్లు రాగా వాటి విలువ 4,83,299గా అధికారులు తేల్చారు. ఇక యశ్వంత్ సిన్హాకు రెండో రౌండ్ ముగిసేసరికి 537 ఓట్లు రాగా... వాటి విలువను 1,79,876గా నిర్ధారించారు. వెరసి యశ్వంత్ సిన్హాపై ముర్ము భారీ మెజారిటీ సాధించే దిశగా దూసుకుపోతున్నారు. ఈ రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశాలున్నట్లు సమాచారం.