Mamata Banerjee: మహారాష్ట్రలోలాగా చేద్దామని చూస్తే.. తగిన సమాధానమిస్తా..: బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్
- మరమరాలు, పాలపొడిపైనా జీఎస్టీ విధించడం ఏమిటని మండిపడిన మమత
- పేదలు ఎలా బతకాలి, ప్రజలు ఏం తిని బతకాలని కేంద్రానికి ప్రశ్న
- బీజేపీ దేశ చరిత్రను మార్చేయాలని చూస్తోందని ఆరోపణ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరమరాలు, పాలపొడి వంటివాటినీ జీఎస్టీ పరిధిలోకి తెచ్చి పన్నులు వసూలు చేస్తోందని.. ఇక ఈ దేశంలో పేద ప్రజలు ఎలా బతకాలని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తోందని విమర్శించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మట్టి కరవడం ఖాయమని వ్యాఖ్యానించారు. రూపాయి విలువ రోజు రోజుకూ పతనం కావడం కేంద్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు.
పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలి
దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర లేనివారు ఇప్పుడు దేశ చరిత్రను మార్చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టినట్టుగా.. పశ్చిమ బెంగాల్ లో చేయాలని చూస్తే.. తగిన రీతిలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ కు పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మరోపక్క, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చెబుతూ.. పశ్చిమ బెంగాల్ అవతల కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని విస్తరిస్తామని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా ఎంపీ స్థానాలు సాధిస్తామని అన్నారు.